ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : ప్రభుత్వ ఆసుపత్రిల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతికై ప్రజలను చైతన్య పరిచి,  వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పురుడు పోసుకునేలా చర్యలు తీసుకోవాలని   జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో వారాంతపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో రోగులకు, డెలివరికి వచ్చే మహిళలకు అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, తాగునీరు అందించాలని, ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. ఆసుపత్రుల్లో విద్యుత్‌ సరఫరా ఇబ్బందులు లేకుండా ఇన్వర్టర్లు ఖరీదు చేయాలని, మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు, నీటి సరఫరా కొనసాగిస్తూ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణకు, మరమ్మతులకు, హెచ్‌డిసిలలో అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయెెూగించుకొని రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు సోమవారం ఆసుపత్రులను తనిఖీ చేసి అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు జరిగేలా చూడాలన్నారు.  ప్రజలకు డెంగీ, అంటువ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ హర్షవర్దన్‌, డిఆర్‌వో జగదీశ్వరాచారి, ఆర్‌డివోలు హన్మంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శివలింగయ్య, జెడిఎ  ధర్మానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.