ప్రభుత్వ చర్యలతో విసిగిపోయాను

– త్వరలోనే ఎగ్గొట్టిన రుణాలన్నీ కట్టేస్తా
– వ్యాపార వేత్త విజయ్‌మాల్యా
లండన్‌, జూన్‌26(జ‌నం సాక్షి) : వివిధ బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌ రప్పించడానికి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. మాల్యాకు ‘పారిపోయిన నేరస్థుడి’ ట్యాగ్‌ ఇవ్వాలని ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ‘పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌’ కింద మాల్యాను పారిపోయిన నేరస్థుడిగా ప్రకటించాలని, ఆయనకు చెందిన రూ.12,500 కోట్ల ఆస్తులు జప్తు చేయాలని ఈడీ ఇటీవల ముంబయి కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై తాజాగా మాల్యా లండన్‌ విూడియా వర్గాల ద్వారా స్పందించారు. ప్రభుత్వం తనపై తీసుకుంటున్న క్రిమినల్‌ చర్యలతో విసిగిపోయానన్నారు. త్వరలో తాను బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాలన్నీ సెటిల్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ‘చాలాకాలం పాటు మౌనంగా ఉన్నానని, ఇప్పుడు నా విషయంలో జరుగుతున్న వివాదాస్పద అంశాలపై స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగ్గొట్టానని కొందరు రాజకీయ నాయకులు, విూడియా వర్గాలు నన్ను దూషిస్తున్నాయి. తప్పుడు ఆరోపణలతో ఈడీ, సీబీఐ నాపై చార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. నాకు సంబంధించిన ఆస్తులను జప్తు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే నేను పోస్టర్‌ బాయ్‌ అయిపోయాను. 2016 ఏప్రిల్‌ 15న ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ రశాను. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని మాల్యా తెలిపారు. మాల్యాకు పారిపోయిన నేరస్థుడి ట్యాగ్‌ ఇవ్వాలని కోరేందుకు.. ఈడీ గతంలో అతడిపై పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌) కింద దాఖలు చేసిన రెండు ఛార్జిషీట్లను ఆధారాలుగా కోర్టులో చూపించింది. పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం కేసు విచారణ ముగిసిన తర్వాతే ఈడీకి ఆస్తులు జప్తు చేసే అధికారం ఉంటుంది. ఇందుకు ఎన్నో సంవత్సరాలు సమయం పడుతుంది. కాబట్టి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద తక్షణమే ఆస్తుల జప్తునకు అవకాశమివ్వాలని ఈడీ కోరుతోంది.