ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
శ్రీకాకుళం, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులు ఉన్నతిగా చదువుకునేందుకు వీలుగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెద్దపాడు వద్ద గల ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను తీసుకుపోయేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న ఒక్కొక్క విద్యార్థికి 29 నుంచి 30వేల రూపాలయల వరకు ఖర్చు అవుతుందని, ఇలా రాష్ట్రం మొత్తం మీద 12 లక్షల మంది విద్యార్థుల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్య సాధనతో గమ్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదువుకోవాలన్నారు. విశ్వాసంతో ముందుకు సాగిన నాడే గమ్యాన్ని చేరుకోగలమని అన్నారు. అడ్డదారిన ఎవరూ పైకి రాలేరని, ఒక వేళ వచ్చినా మనుగడ సాగించలేరని చెప్పారు. అంతకు ముందు విద్యార్థినులతో కలిసి అల్పహారం తీసుకున్నారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, పితాని సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మురళీమోహన్, ప్రిన్సిపాల్ కార్యదర్శి పీటర్, ఎమ్మెల్యేలు నీలకంఠం నాయుడు, నిమ్మక సుగ్రీవులు, జగన్నాయకులు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.