ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
మంత్రి పాలడుగు వెంకటరావు
హైదరాబాద్, జూలై 5 (జనంసాక్షి): ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాలడుగు వెంకటరావు కోరారు. గురువారం ఆయన సిఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దేవదాయ, ఆటవీ శాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అన్నారు. ఈ భూముల పరిరక్షణకై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పాలడుగు కోరారు. ఆటవీ, దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్యాక్రాంతమైన భూములను ఆటవీ, దేవాదాయ శాఖకు చెందిన మంత్రులు ప్రజలకు వివరణ ఇవ్వాలని పాలడుగు కోరారు. రాష్ట్రంలోని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సమస్యలను పరిష్కారించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన అన్నారు. ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ ఆహ్లూవాలియా తన వైఖరి మార్చుకోవాలని కోరారు. ప్రణాళిక సంఘం పనితీరుపై కూడా ఆయన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం తన రాజకీయ భవిష్యత్తు వెల్లడిస్తామని పాలడుగు వెంకటరావు అన్నారు. ప్రభుత్వ ఛీప్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, కృష్ణా జలాల తరలింపుపై తెలంగాణ ప్రజలకు ఆపోహలున్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత మంత్రిపై ఉందని అన్నారు. అదే విధంగా మెడికల్ సీట్ల పంపిణీపై తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గండ్ర కోరారు. రైతుల సమస్యలపై విపక్షాలు చేసే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.