ప్రస్తుత ప్రభుత్వ పనితీరే కొలమానం

తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకున్న క్రమంలో ఎవరికి వారు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా బిజెపి అతిరథ మహారథులను ప్రచారంలోకి దింపింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత రెండో మారు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌,బిజెపిలు బహుశా గతంలో ఎప్పుడూ ఇంతగా పోరాడిన దాఖలాలు లేవు.   రాష్ట్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే తమ ఆటలు సాగవనే బలహీన ప్రభుత్వం ఉండాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. నిజానికి ఎన్నికల్లో ఎప్పుడైనా ప్రస్తుత ప్రభుత్వాలు ఏ మేరకు పనేఇచేశాయన్నదే ప్రజలు గమనిస్తారు. వారి పనులను చూస్తారు. వారు మంచి చేఇవుంటే ఎన్ని వ్యతిరేక ప్రచారాలు జరిగినా ప్రజలు పట్టించుకోరు. అలాగని గతంలో పాలన చేసిన కాంగ్రెస్‌, టిడిపిలను విమర్వించినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకుంటే కూడా పొరపాటే కాగలదు. తెలంగాణ ఏర్పడ్డ 2014లో సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌, ఇప్పుడు చంద్రబాబు సెంటిమెంట్‌తో పోరాడు తోంది. చంద్రబాబును బూచిగా చూపి ఎన్నికల్లో అబ్దిపొందాని చూస్తున్నది.అయితే అది ఎంతవరకు లాభం చేకూరుస్తుందన్నది ఓటర్ల విజ్ఞత, వారి ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుంది. అయితే సామాన్య ఓటర్లపై మత్రం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో బలమైన పార్టీ, స్థిరమైన ప్రభుత్వం ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదన్న వాదనను సిఎం కెసిఆర్‌ ఇప్పటి వరకు బలంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారంలో నిత్యం ఇదే ప్రధాన ప్రచారాంశంగా ఉంటోంది. బలహీనమైన ప్రభుత్వం ఉంటేనే గోదావరి, కృష్ణా నీళ్లను మళ్లీ ఆంధ్రాకు తరలించుకు పోవచ్చని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రచారంలో ఊదరగొడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆంధ్రా నుంచి తెలంగాణకు రావాల్సిన కరెంటు కూడా ఇవ్వలేదని అంటున్నారు. అయినా కష్టపడి నిత్యం మానటరింగ్‌ చేస్తూ నిత్యం  24 గంటల కరెంటును అందిస్తున్నామని  కేసీఆర్‌ అంటున్నారు. రాష్ట్రంలో పాలన నిర్వీర్యం అయితే ప్రాజెక్టులపై, ఇతర వాటిపై పోరాటం చేయలేరని చంద్రబాబు ఆలోచనగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణను అస్థిరపర్చేందుకే చంద్రబాబు కుట్రలు పన్ని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అనీ, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శిం చారు.  వీరికి తోడుగా లగడపాటి కలిశారనీ, ఇప్పటికే తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తానని లగడపాటి చెప్పడం వెనుక చంద్రబాబు ఉన్నారని బలంగా ప్రచారం చేస్తున్నారు. లగడపాటి సర్వే ఊహాజనిత మైందనీ, ఇదంతా పచ్చి బూటకమని కూడా టిఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది. నిజానికి ఎన్నికల ముందు సర్వేలు చేయడం పరిపాటి. ఇవన్నీ ఓ రకంగా ఆయా పార్టీలకు మద్తుగా చేస్తున్నవే. ఇందులో నిజాయితీ ఉంటుందనుకోవడం పొరపాటు. అలాంటిదే లగడపాటి సర్వే కూడా. ఎవరెన్ని సర్వేలు చేసినా అనుకూలం గా ఉంటే ఓ రకంగా లేకుంటే మరో రకంగా స్పందించడం రాజకీయ పార్టీలకు కూడా సర్వసాధారణం. తెలంగాణలో యువతను తప్పుదారి పట్టించేందుకే ఈ సర్వేలు ప్రచురితం చేస్తున్నారని అధికార టిఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలు కూడా ఈ కోవలోకే వస్తాయి. అందుకే చంద్రబాబు చేతుల్లోకి మరోసారి తెలంగాణ వెళ్లకుండా చూడాలని ప్రధానంగా ప్రచారం ఉధృతం చేశారు. ఓ రకంగాఈ ప్రచారం బాగానే పనిచేస్తున్న దనే చెప్పాలి. ప్రజల్లో కూడా దీనిపై చర్చ సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖలను రద్దు చేసుకుంటారో లేదా అన్నది ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిజానికి ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్టాటకల
పైనా మనం అనేక లేఖలు రాశాం. అవన్నీ ప్రభుత్వ పరంగా మన విధానాలు. వాటిని ఉపసంహరించు కుంటామని చెప్పగలమా అన్నది టిఆర్‌ఎస్‌ నేతలు వివరించాలి. అయితే ప్రచార ఎత్తుగడల్లో ఇలాంటివన్నీ సహజంగానే భావించాలి. ప్రజలకు ఎవరేం చేశారన్నది చూస్తారు. ఉమ్మడిరాష్ట్రంలో చంద్రబాబు తెలంగాణ కు ఏమైనా మంచి చేసివుంటే ఆదరిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. వచ్చిన తెలంగాణలో కెసిఆర్‌ తెలంగాణ కు ఏం చేశారన్నదే ఇప్పుడు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. గతంలో చంద్రబాబు లేదా కాంగ్రెస్‌ ఏంచేసింద న్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. మూడు నెలల క్రితం ఎన్నికలకు వెళుతున్నట్లు కెసిఆర్‌ ప్రకటించినప్పుడు  టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. అయితే ప్రచారంలో రానురాను ఉధృతి పెరగడం, తెలంగాణకు చేసిన కార్యక్రమా లపై నిత్యం చర్చ జరగడంతో ఇప్పుడు ఆ పార్టీ మరింత బలహీనపడుతోందనీ, అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందనీ తాజా సర్వేలలో స్పష్టమవుతోంది. అధికార పార్టీపై వ్యతిరేకత ఎందుకు ఇంతాగా పెరుగుతున్నదో పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. అందుకేచంద్రబాబును బూచిగా చూపుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఓడిపోతామని తెలిసినా తమ గెలుపు ఖాయమైందని ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పుకొంటారు. ఈ క్రమంలోనే తమకు వంద కాదు.. నూట ఆరు స్థానాల దాకా వస్తాయని తాజా సర్వేలలో వెల్లడైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా నిత్యం చెప్పుకొంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఆయనకు తెలియదనుకోలేం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమకు పూర్తి అనుకూలంగా ఉంటాయని కేసీఆర్‌ నిజంగా నమ్మితే ఇంతగా ప్రచారం చేసుకోవాల్సిన ఆగత్యం లేదు. కోదండారమ్‌ నేతృత్వంలో విపక్షాలు ఏకం కావడం ఓ రకంగా కెసిఆర్‌కు ప్రతికూలంగా మారిందనే చెప్పాలి. పరిస్థితులలో వస్తున్న మార్పులను గుర్తించి విరుగుడు చర్యలు తీసుకునే బదులు ఎదురుదాడితో కెసిఆర్‌ ముందుకు పోతున్నారు. కాగజ్‌/-నగర్‌ సభలో ఒకరు 12శాతం రిజర్వేషన్ల గురించి అడిగితే దబాయించిన విషయం ప్రత్యక్ష ప్రసారం అవుతున్నా కెసిఆర్‌ పట్టించుకోలేదు. అంటే తాను చెప్పిందే వినాలనే ధోరణిని కెసిఆర్‌ పెంచయుకోవడం వల్ల ప్రజల అభిప్రాయాలకు విలువనివ్వడం లేదు. అందుకే ప్రతికూల సర్వేలను, చంద్రబాబును బూచిగా చూపి ప్రచారం చేయడం ద్వారా విజయం సాధించాలని చూస్తున్నారు.