ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు తొలిమెట్టు పై దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
హన్మకొండ బ్యూరో చీఫ్ 13 అక్టోబర్ జనంసాక్షి
ప్రాథమిక స్థాయి విద్యార్థుల సామర్థ్యాలను పెంచే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టుకార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, మండల విద్యాశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో అమలవుతున్న తొలిమెట్టు కార్యక్రమములో విద్యార్థుల అభ్యసన స్థాయిల స్థితిగతులను, ఉపాధ్యాయులు అవలంభిస్తున్న బోధనా ప్రక్రియలను ఆయన మండల విద్యాశాఖ అధికారులను ప్రశ్నించి తెలుసుకున్నారు.
పాఠశాల విద్య కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ జూమ్ ద్వారా ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. తదుపరి జిల్లాలో ఈ నెల 15 నుండి 31 వరకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా తరగతిగది బోధన పైన శ్రద్ధ చూపించాలని ఆయన తెలిపారు. ఈ నెల ఆఖరి వరకు మండల తొలిమెట్టు నోడల్ అధికారులు, క్లస్టర్ తొలిమెట్టు నోడల్ అధికారులు విద్యార్థులను మదింపు చేయడం కాకుండా ఉపాధ్యాయుల హాజరు, ఉపాధ్యాయుల తరగతిగది బోధనలను పరిశీలించి తగు సూచనలు చేయడమే కాకుండా విద్యార్థుల ప్రగతికి వారు ఏమి చేయాలో తెలియజేయాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమ షెడ్యూల్ను క్రమంగా అమలు చేస్తూ ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషా సబ్జెక్టులలో, గణితము సబ్జెక్టులో పూర్తి స్థాయి తరగతి వారి సామర్థ్యాలు కలిగి ఉండేటట్లు చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమములో జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ ఎ. శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి శ్రీమతి బి. రాధ, ప్లానింగ్ కోఆర్డినేటర్ పీ శ్రీనివాస్, జెండర్ కోఆర్డినేటర్ శ్రీమతి జయ, మండల విద్యాశాఖ అధికారులు రామ్ కిషన్రాజు, వెంకటేశ్వర రావు, రవీందర్, రమాదేవి పాల్గొన్నారు.