ప్రియాంకాను తీసుకురండి

– కాంగ్రెస్‌ను గెలిపించడం రాహుల్‌ వల్ల కాదు
– ఊపందుకున్న నినాదం
న్యూఢిల్లీ, మే15(జ‌నం సాక్షి ) : మరో రాష్ట్రం కాంగ్రెస్‌ చేతుల్లో నుంచి జారిపోయింది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌కు పిలుపునిచ్చిన బీజేపీ ఆ దిశగా మరోఅడుగు ముందుకేసింది. దేశమంతా ఆసక్తిగా చూసిన కర్ణాటకలో మరోసారి కమలం తన సత్తాను చాటుకుంది.  మ్యాజిక్‌ ఫిగర్‌కు కొద్ది సీట్ల దూరంలో నిలిచింది. 2014లో కాంగ్రెస్‌ ఎన్నికల సారథిగా మొదలైన రాహుల్‌ గాంధీ పరాజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయిన తర్వాత రాహుల్‌ మరో కీలక రాష్ట్రాన్ని కోల్పోయారు. ఈ విజయంతో దక్షిణ భారతదేశంలో మరోసారి బీజేపీ తన సత్తాను చాటినట్లయింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోదీకి దీటుగా రాహుల్‌ ప్రసంగాలు చేసినా.. అవి జనాన్ని ఆకట్టుకోలేకపోయాయి. కర్ణాటకలో ఓటమితో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాని కార్యాలయం మూగబోయింది. ఆపార్టీ కార్యకర్తల ముఖాలు వాడిపోయాయి. దీంతో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌ మరోసారి తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్‌లో రాహుల్‌ సోదరి ప్రియాంకా గాంధీకి కీలకపాత్ర ఇవ్వాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. రాహుల్‌ వెన్నంటి నడిచిన వాళ్ల నుంచే ఈ డిమాండ్‌ రావడం గమనార్హం. నేనెప్పుడూ రాహుల్‌ వెంటనే ఉన్నాను. ఇప్పుడూ ఉంటాను. కానీ ఇప్పటికైనా పార్టీలో ప్రియాంకాకు కీలకపాత్ర ఇవ్వాలి. దీనినిబట్టే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయావశాకాలు ఆధారపడి ఉంటాయి అని ఓ కార్యకర్త చెప్పారు. కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్‌ గెలుస్తుందని ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌కు భారీగా చేరుకున్న కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయారు. వాళ్లంతా ఇప్పుడు ప్రియాంకాను తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిజానికి ఈసారి రాహుల్‌ కూడా కాస్త కాన్ఫిడెంట్‌గానే కనిపించారు. గెలుపుపై విశ్వాసంతో 2019లో తానే ప్రధాని అవుతా అని కూడా ప్రకటించారు. కానీ అంచనాలు మళ్లీ ఎదురుతన్నాయి. అటు ఇప్పటివరకు ప్రియాంకా మాత్రం కాంగ్రెస్‌కు బలమైన స్థానాలైన అమేథి, రాయ్‌బరేలీకే పరిమితమయ్యారు తప్ప మిగితా ప్రాంతాలపై పెద్దగా దృష్టి సారించలేదు.