ప్రియురాలి గిప్ట్ కోసం…రిస్క్ తీసుకున్నాడు

aksha

ప్రియురాలికి వాలెంటైన్స్ డే కానుక ఇవ్వాలన్న తాపత్రయం ఓ ప్రేమికుడిని కటకటాలపాలు చేసింది. గిప్ట్ ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేసేందుకు అతగాడు మున్నాభాయ్ అవతారం ఎత్తి చివరకు ఊచలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి శైలేంద్ర పరిహార్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న  తన లవర్కు ఏదైనా బహూమతి ఇవ్వాలని భావించాడు.

అయితే గిప్ట్ కొనేందుకు అతని దగ్గర డబ్బులు లేవు. ఈ విషయాన్ని అతడు  ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన తన స్నేహితుడు వీరేంద్ర గంగ్వార్కు చెప్పాడు.  గిప్ట్ కొనేందుకు సాయం చేయటంతో పాటు.. తన ఖర్చులతో సిటీ అంతా చూపిస్తానని పరిహార్ను అతడు బరేలీకి ఆహ్వానించాడు.  మిత్రుడి ఆఫర్తో పరిహార్ బరేలీలో వాలిపోయాడు.

జైపూర్ నుంచి వచ్చిన పరిహార్కి తన స్నేహితుడంటూ ఫరుఖాబాద్కు చెందిన మోను పాల్ను వీరేంద్ర పరిచయం చేశాడు. పాల్కు మిలటరీ మెడికల్ పరీక్ష ఉందని, అతడికి బదులుగా ఆ పరీక్ష రాస్తే రూ.5000 వేలు ఇస్తాడని పరిహార్ను  వీరేంద్ర గంగ్వార్ ఒప్పించాడు.  ఎలాగైనా ప్రియురాలికి గిప్ట్ ఇవ్వాలనుకుంటున్న పరిహార్ వారితో డీల్ కుదుర్చుకున్నాడు.

ఫిబ్రవరి 4వ తేదీన పరీక్ష రాసేందుకు పాల్కు బదులుగా పరిహార్ వెళ్లాడు. ఇంతవరకు అంత సవ్యంగానే ఉంది. ఒరిజనల్ సర్టిఫికెట్లలో ఉన్న సంతకానికి పరీక్ష సమయంలో చేసిన సంతకం తేడాగా ఉండటంతో ఇన్విజిలేటర్లకు అనుమానం వచ్చింది.దాంతో అతడికి బయోమెట్రిక్, ఇతర పరీక్షలు నిర్వహించి పాల్కు బదులుగా పరిహార్ హాజరయ్యాడని నిర్ధరించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులకు పరిహార్ మొదట్లో తన వివరాలు చెప్పడానికి నిరాకరించాడు.  అయితే పరిహార్ ఫొటోను టీవీలో చూసిన అతని సోదరుడు బరేలికి రావటంతో అప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఫరుఖాబాద్కు చెందిన మోను పాల్ మిలటరీ మెడికల్ ఎగ్జామ్ ఒకసారి ఫెయిలయ్యాడని, అతడికి వినికిడి సమస్య ఉన్నందున తనకు బదులు ఎవరైనా మెడికల్ టెస్ట్కు హాజరైతే రూ.5 వేలు ఇస్తానని ఆఫర్ చేశాడని అసలు విషయం బయటపెట్టాడు.

ప్రియురాలికి ఏదైనా కానుక ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలో మంచి అవకాశం వచ్చిందని భావించి ఈ పని చేశానని పరిహార్ తన తప్పును అంగీకరించాడు. ఐపీసీ సెక్షన్లు 420, 467, 468 కింద ప్రియుడు పరిహార్పై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు బరేలీ నగర ఎస్పీ రాజీవ్ మల్హోత్రా తెలిపారు.