ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా స్థానిక 42వ వార్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 2లో రూ. 23, 46, 682తో చేపట్టిన మౌలిక వసతుల బలోపేత పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు.పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు.జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి , ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు అంగిరేకుల రాజశ్రీ నాగార్జున, చింతలపాటి భరత్ , విద్యాశాఖ ఏడీ శైలజ, ఎస్ఎంసి చైర్మన్ బి.జ్యోతి , పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంకతి వెంకన్న , ఉపాధ్యాయులు నరేందర్, శ్రీనివాస్ రావు, రమేష్, శ్రీరాములు, మురళి, విజయశాంతి, చైతన్య , నాయకులు సట్టు శంకర్ , మధు, జలీల్ పాషా, మహేష్ , జానీరాం , నీలిమ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.