ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య

– ఆకునూరు ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్, సీపీఐ నేత అశోక్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 27: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య ఉంటుందని ఆకునూరు ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. శనివారం మండలంలోని ఆకునూరు గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం స్థానిక ప్రధానోపాధ్యాయురాలు ఎస్. సులోచన అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. సమాజంలోని ప్రతీ ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతీ తల్లి తండ్రి కోరుకుంటారన్నారు.తల్లిదండ్రులు,ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరిపైన ఉందన్నారు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైనదని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల మౌలిక వసతుల కోసం దాతలు ముందుకొచ్చి అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కొంక శశిధర్, ఉపాధ్యాయులు మేడిచల్మి అయోధ్య, అక్కనపల్లి ఇంద్రసేనా రెడ్డి, తాటికొండ యాదయ్య, ఉప్పల భాస్కర్, గొంటి బుచ్చయ్య, కామిడి రత్నమాల విద్యార్థుల తల్లిదండ్రులు సూర రాజు, అనుముల రాజశేఖర్ రెడ్డి, సూర సంపత్, అమరగొండ బాలరాజు,కడారి కిష్టయ్య, దుబ్బుల కనకయ్య, ఆరె శోభ, రజిత, భాగ్య, మౌనిక, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.