ప్రైవేట్ కిట్లతో లెక్కకు రాని కేసులు
గుట్టుచప్పుడు కాకుండా చికిత్సలు
బయట తిరుగడంతో పెరుగుతున్న సంఖ్య
విజయవాడ,జనవరి29 (జనంసాక్షి) : ఇప్పుడు కరోనా టెస్టులు కూడా ఇంటివద్దే నిర్వహించుకునేలా కిట్లు రావడంతో చాలామంది వాటిని ఉపయోగించుకుంటున్నారు. ప్రతి మెడికల్ షాపులో ఇది అందుబాటులోకి వచ్చింది. కేవలం 250 రూపాయలతో టెస్ట్ చేసుకునే అవకాశం ఏర్పడిరది. దీంతో స్వల్ప లక్షణాలు కనిపించగగానే ఎవరికి వారు కిట్లు తెచ్చుకుని ఉపయోగిస్తున్నారు. ఇలా తమకు కరోనా లక్షణాలు ఉన్నాయన్న విషయం బయట పడకుండా ఉండేందుకు ప్రయత్నించే వారే ఎక్కువగా ఉన్నారు. వీరు తమ లక్షణాలను బయటపడకుండా జాగ్రత్తపడుతూ మందుల షాపుల్లోనూ, వాట్సాప్ గూప్రుల్లోనూ,
ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లు సూచించే మందులు వాడుతూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి పెరుగుతోందన్న భయాలు కూడా ఉన్నాయి. పలుచోట్ల మరణాలు సంభవించినా వాటిని సాధారణ మరణాలుగా చెప్పుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు సాగించేసిన పరిస్థితులు కూడా పలుచోట్ల నడుస్తున్నాయి. కరోనా ప్రైవేటు నిర్దారణ, చాటు మాటు వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోతే మాత్రం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కూడా పొందే పరిస్థితులు కరోనా మృతుడి కుటుంబాలకు లేకుండా పోతోంది. కరోనా విజృంభిస్తున్న వేళ జిల్లాల్లో కరోనా పరీక్షలు, వైద్యం ప్రైవేటుగా విచ్చలవిడిగా సాగుతున్నాయి. కరోనా లక్షణాలుంటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలోనూ, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో నిర్వహించే నాణ్యమైన ప్రైవేటు ల్యాబ్‌లలో చేయించుకునే పరీక్షలు మాత్రమే లెక్కలకు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలే సాంకేతిక ఆమోదమైన పరీక్షలు కావడంతో వాటి ఫలితాలనే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. అయితే కరోనా నిర్దారణ కోసం మందుల షాపుల్లోనూ, ప్రైవేటు లేబొరేటరీలన్నింటా ర్యాపిడ్ కిట్లు లభిస్తుండడంతో చాలా మంది ఆరోగ్య కేంద్రాలకు, ఆమోదం పొందిన లేబొరేటరీలకు వెళ్లకుండా ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఈ పరీక్షల్లో పాజిటివ్ నిర్దారణ జరిగినా అవి లెక్కల్లోకి రావడం లేదు. ప్రైవేటుగానే కాకుండా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో కూడా ర్యాపిడ్ టెస్టులు జరిగినా అవి కూడా లెక్కల్లోకి రాని పరిస్థితులు ఉన్నాయి. విషయం బయట పడకుండా ఉండేందుకు..ఆర్‌టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు తక్షణం రాని పరిస్థితుల్లో వాటి కోసం రెండో రోజు వరకూ వేచి ఉండలేని వారు మాత్రం ర్యాపిడ్ టెస్టులకే మొగ్గు చూపుతున్నారు. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారు కొందరు సాంకేతికంగా నిర్దారణ జరిగే ఆర్‌టీసీపీఆర్ పరీక్షలకు వెళుతున్నా మెజారిటీ సంఖ్యలో మాత్రం ప్రైవేటు వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. కరోనా విస్తరించకుండా కట్టడి చేయాలన్నా అధికార్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రైవేటు పరీక్షల ఫలితాలు కూడా రికార్డులకు ఎక్కేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రైవేట్ కిట్లతో టెస్టులు చేసుకున్నా నమోదు చేస్తేనే వ్యాప్తి తెలుస్తుందని అంటున్నారు.