ప్రోటెమ్‌ స్పీకర్‌గా కేజీ బోపయ్య నియామకం

– ఆదేశాలు జారీ చేసిన గవర్నర్‌ హజూభాయ్‌
– బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన బోపయ్య
– బోపయ్య నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌
– మరోసారి సుప్రీంను ఆశ్రయించే ఆలోచనలో కాంగ్రెస్‌ నేతలు
– కీలకం కానున్న ప్రొటెం స్పీకర్‌ పాత్ర!
– ఉత్కంఠగా మారిన కన్నడ రాజకీయాలు
– నేటి సాయంత్రానికి తేలనున్న భవితవ్యం
బెంగుళూరు, మే18(జ‌నం సాక్షి ) : కర్ణాటక రాజకీయాలు క్షణంక్షణం ఉత్కంఠతను పెచుతున్నాయి. సుప్రిం ఆదేశాలతో శనివారం సాయంత్రం జరగబోయే కర్నాటక అసెంబ్లీ బలపరీక్షలో ప్రోటెమ్‌ స్పీకర్‌ కీలకంకానున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రోటెమ్‌ స్పీకర్‌గా ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయ్‌ నియమిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా బోపయ్య నియామకాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రొటెమ్‌ స్పీకర్‌ నియామకంలో గవర్నర్‌ సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్‌ కావాలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. మరోవైపు బోపయ్య నియామకాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సుప్రీంకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రోటెమ్‌ స్పీకర్‌ అంటే తాత్కాలిక స్పీకర్‌. అధికారిక స్పీకర్‌ ఉండడు కాబట్టి.. బలపరీక్షకు కావాల్సిన తతంగం అంతా ఆయన చేతులవిూదుగానే సాగాల్సి ఉంటుంది. సీఎం యడ్యూరప్ప ఇచ్చిన లేఖ ప్రకారం.. గవర్నర్‌ ప్రోటెమ్‌ స్పీకర్‌ను నియమించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటల లోపే బల నిరూపణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఇప్పుడు కీలక బాధ్యతలన్నీ ప్రోటెమ్‌ స్పీకర్‌ ఆధీనంలోనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బలపరీక్ష కోసం ముందుగా ప్రోటెమ్‌ స్పీకర్‌.. స్పీకర్‌ను ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇటీవల గోవా అసెంబ్లీలో బలపరీక్ష ఘట్టం మొత్తం ప్రోటెమ్‌ స్పీకర్‌ ఆధ్వర్యంలోనే సాగింది. ప్రోటెమ్‌ స్పీకర్‌కు గవర్నర్‌ అన్ని అధికారాలను ఇవ్వడం వల్ల ఇలాంటి సందర్భం చోటుచేసుకుంటుంది. క్యాబినెట్‌ లేని కారణంగా.. సభలో సీఎం యడ్యూరప్పే .. విశ్వాస పరీక్ష కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. సాధారణంగా సింగిల్‌ లైన్‌లోనే ఆ తీర్మానం సాగుతుంది. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతి తర్వాత బలపరీక్ష కోసం ఓటింగ్‌ జరుగుతుంది. ఆయా పార్టీలు ఇచ్చిన విప్‌ ఆదేశాల ప్రకారం ఓటింగ్‌ పక్రియ కొనసాగుతుంది. ఎవరైనా ఆ విప్‌ను ఉల్లంఘిస్తే, వాళ్లపై అనర్హత వేటుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరిపైన అనర్హత వేయాలన్న అంశాన్ని మాత్రమే స్పీకరే నిర్ణయిస్తారు. ఒకవేళ ఓటింగ్‌లో యడ్యూరప్ప విజయం సాధిస్తే, ఆయన సీఎంగా కొనసాగుతారు. లేని పక్షంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌కు బల నిరూపణ కోసం ఆహ్వానం అందుతుంది. ఒకవేళ ఆ కూటమి కూడా బలపరీక్షలో నెగ్గలేకపోతే.. అప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. రాష్ట్రపతి పాలనను విధిస్తారు లేదా మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.