ఫలించని కావేరీ కష్టాలు
బెంగళూరు, నవంబర్ 29 : తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసేందుకు కర్ణాటక నిరాకరించడంతో ఇరు రాష్ట్రాలమధ్య కావేరీ వివాదంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కావేరీ జలాల వివాదాన్ని సంయమనంతో పరిష్కరించుకునేందుకు ఎందుకు ప్రయత్నించరు? ఇరురాష్ట్రాల నేతలు కలిసి కుర్చొని మాట్లాడుకుని ఒక సానుకూల నిర్ణయాన్ని తీసుకోవడం అసాధ్యమేమీ కాదని, అందుకు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత, కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌తో గురువారంనాడు సమావేశమయ్యారు. ముఖాముఖి జరిపిన ఈ చర్చలు విఫలమయ్యాయి. సమావేశం అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతూ కావేరీ జలాలను తమ రాష్ట్రానికి విడుదల చేసేది లేదంటూ కర్ణాటక నిర్ధ్వందంగా తిరస్కరించిందని చెప్పారు. తమ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ కనీసం 32టిఎంసీల నీటినైనా విడుదల చేయాలని కోరినా కర్ణాటక ముఖ్యమంత్రి షట్టర్ అంగీకరించలేదని తెలిపారు.
వాస్తవాలన్నీంటిని వివరించి తమిళనాడుకు తగిన నీరు విడుదల చేయాలని కోరామన్నారు. ఒక చుక్క నీరు కూడా విడుదల చేయలేమని ఖచ్చితంగా కర్ణాటక చెప్పిందని తెలిపారు. తమ సమావేశ వివరాలను సుప్రీంకోర్టుకు తెలియజేస్తామని జయలలిత చెప్పారు. శుక్రవారంనాడు ఈకేసు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు దృష్టికి ఈ వివరాలను అందిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఈ సమస్యపై తిరిగి చర్చించేందుకు తాను చెన్నై వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తెలిపారు. ఇది కేవలం ఇరురాష్ట్రాల మధ్య సమస్య. ఇందులో జాతీయ రాజకీయాల ప్రమేయం లేదన్నారు. ఈ విషయంపై ఆయన మరింత స్పష్టత ఇస్తూ తమిళనాడుకు నీరు ఇచ్చేందుకు తాను తిరస్కరించలేదని, అయితే ఇక ఏ మాత్రం నీరు విడుదల చేసే పరిస్థితిలో తమ రాష్ట్రం లేదని చెప్పారు. తమ వద్ద కేవలం 37 టిఎంసీల నీరు మాత్రమే ఉన్నందున మరింత నీరు విడుదల చేయలేమని అన్నారు. నీరు ఇవ్వబోమని చెప్పడం ప్రశ్నే కాదని, అయితే ఈ దఫా నీరు విడుదల చేసే పరిస్థితిలో లేమని, ఈ విషయంపై మరోసారి చర్చిస్తామని షెట్టర్ చెప్పారు. జలవివాదంపై ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరపడం గత 15ఏళ్ళలో ఇది రెండోసారి. 1997లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి, కర్ణాటక అప్పటి ముఖ్యమంత్రి జెహెచ్ పటేల్ చెన్నైలో జలపంపిణీపై చర్చలు జరిపారు.