ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
బారీ అశోక్ కుమార్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బారీ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు.ఎంతో మంది విద్యార్థులు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్స్ రాక విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పి మోసం చేశారన్నారు.విద్యారంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.అన్ని ప్రభుత్వ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు.విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడం తగదన్నారు.ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య , జన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు తగుళ్ళు జనార్థన్ యాదవ్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కోల కరుణాకర్, శేఖర్, నవీన్, మహేష్ చారి, మహేష్ , అంజి, నరేష్, యశ్వంత్, విక్రమ్, పవన్, స్వాతి, కీర్తన,సంధ్య, శృతి, తదితరులు పాల్గొన్నారు.