బంగారం అక్రమ రవాణాలో ఎయిర్ ఇండియా ఉద్యోగి అరెస్ట్

ఢిల్లీ:సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది ఒకరు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. తనిఖీల అనంతరం ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న సౌదీ పోలసులు.. శుక్రవారం కూడా విచారిస్తున్నారు. ఈ అరెస్టుతో కేవలం 11 మంది సిబ్బందితో మాత్రమే కొచి జెడ్డా విమాన సర్వీసును నడిపించారు. నిబంధనల ప్రకారం విమానంలో 12 మంది సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారలు ఆలస్యంగా స్పందించారు. క్యాబిన్ క్రూలో ఒకరిని జెడ్డా ఎయిర్ పోర్టు అధికారులు అరెస్టుచేసింది నిజమేనని, అందుకు గల సహేతుక కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం మీడియాకు చెప్పారు. ఉద్యోగి తప్పుచేసినట్లు తేలితే విధుల నుంచి తొలిగిస్తామని పేర్కొన్నారు.