బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
అతలాకుతలమవుతున్న శ్రీకాకుళం, ఆదిలాబాద్ జిల్లాలు
పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
నిలిచిన బస్సులు.. ఒరిగిన విద్యుత్ స్తంభాలు
హైదరాబాద్/విశాఖపట్నం/ఆదిలాబాద్/శ్రీకాకుళం,
జూన్ 14 (జనంసాక్షి) :
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీరంమీదుగా అల్పపీడనం సాగుతోందని అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురియనున్నట్టు చెప్పారు. ఉత్తరకోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయన్నారు. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో నిన్నటినుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీటితో నాగావళి, వంశధార ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఆ రెండు నదుల్లోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో హిర మండలం, గొట్ట బ్యారేజీ వద్ద 22 గేట్లను ఎత్తివేశారు. ఒడిశాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తో సహా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు.