బంగ్లాదేశ్‌లో టీ ట్వంటీ

వరల్డ్‌కప్‌ డౌటే!

ఢాకా, జూన్‌ 24 (జనంసాక్షి) :

వచ్చే ఏడాది జరగనున్న ట్వంటీ ట్వంటీ ప్రపంకప్‌ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం బంగ్లాదేశ్‌లో టోర్నీ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. అనుకున్న సమయానికి స్టేడియాలు పూర్తిస్థాయిలో సిధ్ధమయ్యే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం. దీంతో ప్రత్యామ్నాయ వేదికలుగా శ్రీలంక , దక్షిణాఫ్రికాలు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 16 నుండి ఏప్రిల్‌ 6 వరకూ బంగ్లాదేశ్‌లో పురుషుల , మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లు జరగనున్నాయి. ప్రధాన వేదికలు విూర్పూర్‌ , చిట్టగాంగ్‌ స్టేడియాలు రెడీగా ఉన్నప్పటకీ… కొత్త స్టేడియాల నిర్మాణం నెమ్మదిగా జరుగుతోంది. ఇటీవల అక్కడ పర్యటించిన ఐసిసి ప్రతినిధులు కొత్త స్టేడియం సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్నీ నిర్వహణ సమయానికి స్టేడియం సిధ్దమవుతుందన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. అటు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు కూడా నిర్వహణా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేసింది. బిసిబి ప్రెసిడెంట్‌ నజాముల్‌ హస్సన్‌ సంబంధిత అధికారులపై అసహనం కూడా వ్యక్తం చేసినప్పటకీ… పనులు మాత్రం నిదానంగా జరుగుతున్నాయి. దీంతో వచ్చే వారం జరగనున్న ఐసిసి వార్షిక సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే సెప్టెంబర్‌లో మరోసారి బంగ్లా పర్యటనకు ఐసిసి ప్రతినిధులు రానుండగా… అప్పటికి స్టేడియాలు పూర్తవుతాయని బిసిబి భావిస్తోంది. ఒకవేళ అప్పటికి సిధ్దం కాకపోతే… టోర్నీ నిర్వహణను శ్రీలంక లేక సౌతాఫ్రికాలకు మార్చే అవకాశం కనిపిస్తోంది. గత ఎడిషన్‌కు కూడా లంకనే ఆతిథ్యమిచ్చింది.