బంగ్లా, పాక్‌తో సిరీస్‌ ఆడనున్న భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ప్రభుత్వ అనుమతి కోసం ఫెడెరేషన్‌ ఎదురుచూపు


న్యూఢిల్లీ ,మే 6 (జనంసాక్షి): అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రణాళికలు సిధ్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా వచ్చే జూన్‌లో బంగ్లాదేశ్‌ , పాకిస్థాన్‌ జట్లతో స్నేహపూర్వక సిరీస్‌ ఆడాలని భావిస్తోంది. ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌కు ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్‌ ఖరారు చేయనుంది. దీని కోసం ఇప్పటికే కేంద్రక్రీడాశాఖకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే మ్యాచ్‌లు ఆడేందుకు గతంలోనే ఫెడరేషన్‌ అంగీకరించినా… ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతి లేనిదే ముందడుగు వేయకూడదని నిర్ణయించుకుంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో తటస్థ వేదికపై కూడా వారితో ఆడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా మారింది. ఇటీవల భారత స్క్వాష్‌ జట్టు పాక్‌ టూర్‌ను రద్దు చేసుకోవడం.. హాకీ ఇండియా లీగ్‌లో పాక్‌ ఆటగాళ్ళను ఆడనివ్వకుండే తిప్పి పంపడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య క్రీడాసంబంధాలు సరిగా లేవు.
దీంతో ప్రభుత్వం నుండి అనుమతి వచ్చే వరకూ వేచి చూడాలని ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ నిర్ణయించింది. షెడ్యూల్‌ ప్రకారం ఇంగ్లాండ్‌ వేదికగా జరిగే ఈ సిరీస్‌లో జూన్‌ 1న భారత్‌, బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. మూడురోజుల తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ ఆడనుండగా… మళ్ళీ జూన్‌ 8న భారత్‌, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.