బండిది మౌన దీక్ష కాదు ఈర్ష, ద్వేష దీక్ష

 

* ధరణి తో 98 శాతం సమస్యలు తగ్గినాయి
* మోడీ డేట్ ప్రకటిస్తే ముందస్తుకు సిద్ధమే
* కేంద్రం వానాకాలం పంట కొంటదా? కొనదా?
* సిలిండర్ ధర పై ప్రతి మహిళ కుర్చీ వేసుకొని కూర్చుంటుంది
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి)  :
బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేస్తున్నది  మౌనదీక్ష కాదు ఈర్ష, ద్వేష దీక్ష అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం స్థానిక మీ సేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సంజయ్  దీక్షలో కేసీఆర్  కోసం వేసిన కుర్చీపై దీటుగా స్పందించారు. మోడీ ఆపీసు ముందు కుర్చీవేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు . గత ఎన్నికల హామీల్లో బాగంగా 15లక్షలు అకౌంట్లో వేయనందకు ఏ బ్యాంకు, ఏటీఎం ముందు కుర్చీ వేయాలి అని ప్రశ్నించారు. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాఅన్నారు, అలా 16కోట్ల ఉద్యోగాల కోసం యూపీఎస్సీల ముందు కుర్చీ వేద్దాము రా అంటూ మండిపడ్డారు. బ్లాక్ మనీ కోసం ఆర్బీఐ, ఈడీల ముందు కుర్చీ వేద్దాము రా అంటూ సంజయ్  ఆహ్వానించారు.  గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజీల్ ధరల పెంపుకోసం దేశంలోని మొత్తం మహిళలతో సహా మేం వస్తామని, ఎల్ఐసీ ఆఫీసు ముందు, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ముందు కుర్చీ వేసుకొని ప్రైవేటీకరణ చేయోద్దని నినదిద్దాము అన్నారు. బీసీలు ఓటేస్తే గెలిచిన ఎంపీ  చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, బీసీ గణన, బీసీ మంత్రిత్వ శాఖను బీసీ ప్రధాని ఎందుకు ఇవ్వడం లేదో ప్రశ్నించాలన్నారు.   తెలంగాణ రైతులు వానకాలం వరి వేయాలా వద్దా, చెప్పండని నిలదీసారు. కెసిఆర్ సవాలును స్వీకరించి మోడీ తేదీని ప్రకటిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమేనని అన్నారు. ధరణి పోర్టల్ తో 98% భూ సమస్యలు తగ్గి రైతులు ఆనందంగా ఉన్నారు అని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా చేరికల కమిటీ అనేది ఏ పార్టీలోనైనా ఉంటుందా అని ప్రశ్నించారు. అది కూడా వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ ,సూడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు ,మేయర్ సునీల్ రావు ,బండ శ్రీనివాస్ ,చల్లా హరిశంకర్ పాల్గొని మాట్లాడారు.