బండి సంజయ్‌, కేటీఆర్‌లకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రమంత్రి బండి సంజయ్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2023లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం నేపథ్యంలో బండి సంజయ్‌పై కమలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని బండి సంజయ్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేవని పేర్కొన్న హైకోర్టు.. కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘించారని మాజీ మంత్రి కేటీఆర్‌, గోరటి వెంకన్నపై సైఫాబాద్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వ పథకాలపై గోరటి వెంకన్న.. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద కేటీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారని, అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేశారని పోలీసులు పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితికి లబ్ధి చేకూర్చే విధంగా ఇంటర్వ్యూ ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చారు. రాజకీయ లబ్ధి కోసమే కేసు నమోదు చేశారని కేటీఆర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. కేటీఆర్‌, గోరటి వెంకన్నపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.