బంద్‌ల నుంచి విద్యా సంస్థలను మినహాయించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 :  బంద్‌ల నుంచి విద్యా సంస్థలను మినహాయించాలని ప్రైవేట్‌ రికగ్నయిజ్‌డ్‌ పాఠశాలల యాజమాన్యం సంఘం కోరింది. శుక్రవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షురాలు ప్రభాదేవీ, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ముజీబ్‌అలీ మాట్లాడారు. బంద్‌ల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కొంత మంది ప్రతి విషయానికి బంద్‌లు నిర్వహిస్తూ పాఠశాలలయాజమాన్యాన్ని ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని  అన్నారు. స్వ ప్రయోజనాల కోసం బంద్‌లను నిర్వహించకుండా వాస్తవ సమస్యలపై బంద్‌కు పిలుపు నిస్తే తాము సహకరిస్తామని వారు తెలిపారు. కొంత మంది వ్యక్తిగత కారణాలతో విద్యాసంస్థలను మూసివేయించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. తెలంగాణ కోసం తమ వంతు బాధ్యతగా కృషి చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బంద్‌ల నుంచి విద్యా సంస్థలను మినహాయించాలన్నారు. ఈ సమావేశంలో ఎం. మోహన్‌, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.