బంద్‌ జరగలేదట!

– బండి సంజయ్‌

హైదరాబాద్‌,డిసెంబరు 8 (జనంసాక్షి): రైతుల శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను రైతులు ఆమోదించారని.. అందుకే భారత్‌ బంద్‌ విఫలమైందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఐఆర్‌, పీఆర్‌సీ సమస్యలను పరిష్కరించాలనే డిమాండుతో త్వరలో అన్ని మున్సిపల్‌ కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం, మంత్రుల మోచేతి నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు. ఆయా నేతలు సమస్యల గురించి పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులే తమకు ఫోన్లు చేసి చెబుతున్నారన్నారు. ఎప్పుడూ తెరాస ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతల గుర్తుంచుకోవాలని.. తర్వాత వచ్చేది భాజపా ప్రభుత్వమేనన్నారు. అహంకారంతో తాము ఈ మాట చెప్పడం లేదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై భాజపా చేపట్టే ఆందోళనలకు ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు తెలపాలని.. లేకుంటే వారి సంగతి చూస్తామని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో అడ్డగోలుగా దోచే ప్రయత్నం జరుగుతున్నా ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆయా సంఘాల నేతలంతా ఎక్కడికెళ్లారని నిలదీశారు. భారత్‌బంద్‌ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై ఆందోళన చేస్తే ఎంతమంది తెరాస నేతలు, మంత్రులను గృహనిర్బంధం చేశారని పోలీసు అధికారుల ఆయన ప్రశ్నించారు. కేవలం భాజపాను కార్యకర్తలను అడ్డుకునేందుకే పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? అంటూ మండిపడ్డారు. పోలీసు వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని.. అందులోని కొంతమంది అధికారుల చర్యలనే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. త్వరలో తాము చేపట్టే ఆందోళనలకూ పోలీసులు సహకరించాలని సంజయ్‌ కోరారు. సన్నవడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.