బట్టబయలు కానున్న పార్టీల అసలు రంగు
తెలంగాణపై ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 28న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి తీరుతామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. తెలుగు మహాసభల నేపథ్యంలో తెలంగాణపై అఖిలపక్షాన్ని వాయిదా వేయాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తిని అంత లోతుగా పరిశీలించలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి మేరకే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ అవసరం లేదని తాను ఎప్పుడూ అనలేదని చెప్పారు. అఖిలపక్షానికి హాజరుకావాలని కోరుతూ త్వరలోనే రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని, ఒక్కో పార్టీ నుంచి ఎందరు హాజరుకావాలో తాము సూచించమని, ఆయా పార్టీలే దీనిపై తేల్చుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు అఖిలపక్షం వాయిదా పడుతుందని, ఇప్పుడే తమ వైఖరి చెప్పాల్సిన అవసరం లేదని సంబరపడిన సీమాంధ్ర పార్టీల నేతల ఆశలపై షిండే నీళ్లు చల్లారు. ప్రభుత్వం కాకుండా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కోరితే అఖిలపక్షం వాయిదా వేసే విషయం పరిశీలిస్తామన్నారు. తెలంగాణ సాధన కోసమే పని చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఇందుకు ఏమాత్రం ఒప్పుకునే అవకాశం లేదు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ కనుక వాయిదా వేయమని ప్రకటిస్తే టీ జేఏసీ వారిని ద్రోహులుగా ప్రకటించడం ఖాయం. హోం మంత్రి షిండే అఖిలపక్షంపై పకడ్బందీగా నిర్ణయం తీసుకున్నారని, పార్టీ పెద్దల నిర్ణయం కూడా ఇదే అయి ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ప్రపంచస్థాయిలో నిర్వహిస్తున్న తెలుగు మహాసభల సమయంలో అఖిలపక్షాన్ని నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ముఖ్యమంత్రి విజ్ఞప్తిని అధిష్టానం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఈ పేరుతో ఢిల్లీలో రెండు రోజుల పాటు తీవ్రస్థాయిలో లాబీయింగ్ చేసిన కిరణ్‌కు మొత్తంగా చుక్కెదురైంది. ఆయన ఒక్కరే తెలంగాణపై అఖిలపక్షం వాయిదా వేయించేందుకు పూనుకున్నారనుకోవడం పొరపాటే. సీమాంధ్ర ప్రాంతానికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆయనతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరిదీ ఒకే జిల్లా. ఒక్కప్పుడు అత్యంత సన్నిహితులు కూడా. ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న ఆయనకు అఖిలపక్షంలో ఆమె చెప్పాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధినేత్రినే కలిసి ఈ విషయమై చర్చించమని బాబు, కిరణ్ కోరే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్‌తో పూర్తిస్థాయిలో తెగతెంపులు చేసుకున్నట్లు మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూలాలు మాత్రం అదే పార్టీలో ఉన్నాయి. వైఎస్ బతికి ఉన్నప్పుడు అన్నీ తానే అయి వ్యవహరించిన కేవీపీని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. ఆయన జగన్ ఆదుకునేందుకు ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. వీరంతా కలిసే రాష్ట్రం పరువు, ప్రతిష్ట అంటూ నానా పేర్లు చెప్పి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నొప్పిపెట్టే దుష్టయత్నం సాగించారు. ఈ దుష్టత్రయం దురాగతాన్ని కేంద్ర ప్రభుత్వం పారనివ్వకపోవడంతో తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట కలిగించే అంశమే. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా తన స్వార్థాన్ని తాను చూసుకుంది. ముందు అన్ని పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకున్నాకే తన వైఖరి ప్రకటించాలని అనుకుంది. ఒకవేళ ఇతర పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకుంటే ఆ నెపం వారిపై నెట్టి 2014 వరకు సమస్యను లాగవచ్చని ఆ పార్టీ తలస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోదు. తన పంతాన్ని నెరవేర్చుకునేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడదు. చిల్లరవర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న యూపీఏ ఆ తీర్మానం ఉభయ సభల్లో ఆమోదం పొందేందుకు తొక్కని అడ్డదారి లేదు. చివరికి సీబీఐని కూడా అస్త్రంగా వాడుకొని సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీని దారిలోకి తెచ్చుకుంది. రాజ్యసభలో గట్టెక్కుతామో లేదోనని తన రహస్య స్నేహితుడు చంద్రబాబు సాయం కూడా కోరింది. చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసుల నుంచి ఉపశమనం పొంది తెలంగాణ రాకుండా అడ్డుకున్న బాబు ఆపదలో ఉన్న పాలకులకు అండగా నిలిచారు. తాను అనుకున్నది సాధించుకునేందుకు, తన అవసరాలు తీర్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలైనే చేసే కాంగ్రెస్ పార్టీ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను మాత్రం అపహాస్యం చేస్తూనే ఉంది. 2004 ఎన్నికల సమయంలో యూపీఏ మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. రాష్ట్రపతి ప్రసంగంలోనూ పెట్టింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ను కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రివర్గంలోకి తీసుకుంది. తర్వాత తన బుద్ధిని మళ్లీ చూపింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమంతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, సీమాంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిడితో వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం ఏమాత్రం చల్లరలేదు. కేంద్రం ప్రకటన చేసిన రోజే టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాన్ని అర్ధరాత్రి ఎలా తీసుకుంటారంటూ అడ్డుతగిలాడు. ఆయన యూ టర్న్ తీసుకోవడంతోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు పోటీ దీక్షలకు తెరతీశారు. అప్పటి వరకు సజీవంగా ఉన్న ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణను గాలికొదిలేసి సమైక్యరాగం ఆలపించింది. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ జగన్ పార్లమెంట్‌లో సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్లకార్డు ప్రదర్శించారు. ఆ రోజు వచ్చిన తెలంగాణను అడ్డుకున్న వారిలో ఒకరైన చిరంజీవి కాంగ్రెస్ కలిసి కేంద్ర మంత్రి అయ్యాడు. జగన్ సొంత పార్టీ పెట్టుకున్నాడు. ప్రకటన సమయానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య తమిళనాడు గవర్నర్ అయ్యారు. అప్పుడు స్పీకర్‌గా తెలంగాణపై అందరి అభిప్రాయాలు తెలుసుకొని రికార్డుల్లో పొందు పరిచిన కిరణ్ సీఎం అయ్యాడు. కానీ తెలంగాణ ప్రజల బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పురాలేదు. ఈనెల 28న ఢిల్లీలో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల అసలు రంగు బయటపడనుంది. ఆయా పార్టీల నగ్నత్వం బట్టబయలు కానుంది. ప్రజల ఆకాంక్షపై వారికున్న విశ్వాసం, విధేయత బయట పడనుంది. డిసెంబర్ 28న తెలంగాణ ప్రజలకు పాలు, నీళ్లను తెలిపే గొప్ప రోజనడంలో ఎలాంటి సందేహం లేదు.