బడి ఎగ్గొట్టే టీచర్లపై వేటేస్తాం: డిఇవో
నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి18(జనంసాక్షి): ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విధులకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై వేటు వేయడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి హెచ్చరించారు. ఇటీవల ఆయన పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసి లోపాలను గుర్తించారు. అలాగే పనిచేకుండా, బడికి రాకుండా డుమ్మాకొడుతున్న టీచర్లపై ఆరా తీసారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వీడాలని, విద్యార్థులకు మెరుగైన విద్యాభోదన చేయాలని సూచించారు. విద్యా ప్రమాణాలు పెంచాలని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేయాలని, ఉపాధ్యాయులందరు విధిగా ప్రార్థనకు హాజరు కావాలని సూచించారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పాఠశాలలు గాడిలో పడుతున్నాయని, మరింతగా పాఠశాలలను బలోపేతం చేయుటకు నిత్యం తనిఖీలు చేయాలని, మండల అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు కూడా జిల్లా అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వకుడదని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. అలాంటి వారిపై వేటు వేయక తప్పదని హెచ్చరించారు.