బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తిరిగి పాఠశాలలో చేర్పించండి : కలెక్టర్ వల్లూరి క్రాంతి విద్యాశాఖ అధికారులకు ఆదేశం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) ఆగస్టు 17 : జిల్లా కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో 14 సంవత్సరాల లోపు పిల్లలు బడి మానేసిన వారి జాబితాను పాఠశాల హెడ్మాస్టర్లు తీసుకుని గ్రామాలలో విచారించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తిరిగి పాఠశాలలో చేర్పించాలని అన్నారు. పత్తి చేలలో, కూరగాయల మార్కెట్ లలో ,  ఇతర పనులలో పిల్లలను పనిలోకి పెట్టుకోరాదని హెచ్చరించారు. గ్రామాలలో రెవెన్యూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టీమ్లుగా ఏర్పడి బడి మానేసిన పిల్లలను,  వీదులలో  తిరిగే 14 ఏళ్లలోపు పిల్లలను బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఎంతమంది బడి మానివేశారు వారి వివరాలను సంబంధిత హెడ్మాస్టర్ తో తీసుకొని విచారించి బడిలో చేర్పించే విధంగా చూడాలని డీఈవోకు ఆదేశించారు. గ్రామాలలో బడి ఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొంతమంది పిల్లలను బడిలో చేర్పించేందుకు ఆధార్ కార్డులు లేవని వారికి ఆధార్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఆదేశించారు. బాల్య వివాహాలను అరికట్టే విధంగా అధికారులు ప్రచారం చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీహర్ష, ఆర్డీవో రాములు, డిఇఓ సిరాజుద్దీన్, కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్,  స్త్రీ శిశు సంక్షేమాధికారి  ముసాయిదా బేగం, సి డబ్లు సి చైర్మెన్ సహదేవులు, హేమలత, నరసింహ, శివకుమార్  తదితరలు పాల్గొన్నారు.