బతుకమ్మ చీరల పంపిణీలో వందల కోట్లు స్వాహా.
నమ్మి అధికారం ఇస్తే అప్పుల తెలంగాణ గా మార్చారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15(జనంసాక్షి):
ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను నమ్మి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ మహిళలకు పంపిణీ చేసిన బతకమ్మ చీరలలో కూడా వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. 8 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రతి నెలలో సమీక్ష సమావేశాలను ఎందుకు నిర్వహించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని కీలక దశకు తీసుకు వెళ్లడంలో ఉస్మానియా యూనివర్సిటీ వహించిన పాత్ర ఎంతో కీలకమని అలాంటి యూనివర్సిటీలో 80 శాతం ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని,ఎందుకు భర్తీ చేయడం లేదని పేదల విద్యపై ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని అన్నారు. 2019 ఎన్నికలలో టిఆర్ఎస్ కు మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేశారని ఆయన ప్రశ్నించారు.ఎన్నో శాశ్వత పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మునుగోడు ఉప ఎన్నికలలో ఓటు అడిగే హక్కు ఉందని బిజెపి టీఆర్ఎస్ లకు హక్కు లేదని ఆయన అన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొడిదెల రాము, నాయకులు తిమ్మాజీపేట పాండు, నారాయణ గౌడ్, మిద్దె మల్లేష్, సుల్తాన్, సుధాకర్, అహ్మద్ పాషా, చంటి తదితరులు పాల్గొన్నారు.