బతుకమ్మ సంబరాలు కోసం బడ్జెట్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేటాయింపు
అభివృద్ధి పనులకు భారీగా కేటాయింపులు
మేయర్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం
మేడిపల్లి – జనంసాక్షి
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు పాలకవర్గం బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలకు వాటి ప్రాధాన్యత ఆధారంగా బడ్జెట్ కేటాయించారు. వాటిలో హరితహారం బడ్జెట్లో భాగంగా చెంగిచెర్ల వైకుంఠధామం నిర్వహణ కోసం ఆరు లక్షలు, 28 డివిజన్లలో గల ట్రీ పార్కుల నిర్వహణ కోసం 28 లక్షలు, ఎస్సీ గ్రేవీ యార్డ్ నిర్వహణ కోసం మూడు లక్షలు కేటాయించారు. ఎనిమిదవ డివిజన్ నందు ముస్లిం గ్రేవీ యార్డ్ ప్రహరీ గోడ నిర్మాణం కోసం 20 లక్షలు, నగరపాలక సంస్థ పరిధి ఖాళీ స్థలాలను సంరక్షించుటకు, ఫెన్సింగ్ ఏర్పాటు కోసం 20 లక్షలు కేటాయించారు. కార్పొరేటర్ల అభ్యర్థన మేరకు పాత పనులను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్త పనులు కేటాయించుటకు వివిధ డివిజన్లో గల పనులను కౌన్సిల్ సమావేశం ఎజెండాలో చేర్చారు. 28 డివిజన్లలో డ్రైనేజీ మరమ్మత్తుల కోసం 20 లక్షలు పెట్టారు. వివిధ కాలనీలలో వరద నీటి డ్రైనేజీల నిర్మాణం కోసం పది లక్షలు కేటాయించడం జరిగింది.
బతుకమ్మ సంబరాల కోసం..
బతుకమ్మ సంబరాలు నిర్వహణ పనులను చేపట్టుటకు ప్రతి డివిజన్ కు 25 వేల చొప్పున ఏడు లక్షలు కేటాయించారు. 28వ డివిజన్ యందు వాటర్ లైన్ కోసం కేటాయించిన 50 లక్షలలో మిగిలిన 10 లక్షల 36వేల రూపాయలను రాఘవేంద్ర కాలనీ, డాక్టర్స్ కాలనీ యందు వాటర్ పైపులైన్ల పునరుద్ధరణ నిర్మానానికి, వివిధ చోట్ల వాటర్ బోర్డు చేత తవ్వబడిన రోడ్లను సీసీ రోడ్ల ద్వారా పునరుద్ధరించుటకు 16 లక్షలు, దేవేందర్ నగర్ గ్రేవ్ యార్డు నిర్వహణ కోసం 20 లక్షలు, 22వ డివిజన్ యందు గల హేమానగర్, వెస్ట్ బాలాజీ హెల్త్ గల పార్కుల అభివృద్ధి కోసం 20 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పద్మజారాణి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల నుంచి అధికారులు పాల్గొన్నారు.