బనకచర్లపై డేగకన్నుతో ఉన్నాం
` హరీశ్‌వన్నీ అబద్ధాలే..
` అసత్య ప్రచారాలు మానుకోవాలి
` ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది: మంత్రి ఉత్తమ్
` భారాస హయాంలో నదీ జలాల విషయంలో చాలా నష్టం జరిగింది
` మేం అధికారంలోకి వచ్చాక వారి పోరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి)::ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘భారాస హయాంలో నదీ జలాల విషయంలో చాలా నష్టం జరిగింది. మేం అధికారంలోకి వచ్చాక నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. భారాస పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. బనకచర్ల విషయంలో అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కి లేఖ రాశాం. ఏపీ పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధం, ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించవద్దని విజ్ఞప్తి చేశాం‘ అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే.. రాజకీయ భవిష్యత్ ఉండదని అన్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమావేశంలో కౌశిక్ రెడ్డి తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మంత్రిగా తాను స్టేజి విూద ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదని అన్నారు. యువ రాజకీయ నాయకుడైన కౌశిక్ రెడ్డికి అంత ఆవేశం పనికి రాదని అన్నారు. కౌశిక్ రెడ్డితో తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని.. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బంది పడతారని అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం
సూర్యాపేట(జనంసాక్షి): తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహనాలకు ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 8 కార్ల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.కాన్వాయ్ ప్రమాదం నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేశారు. ఉత్తమ్ ఆరోగ్యం, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అంత బావుంది.. డోంట్ వర్రీ అని ఆయనతో ఉత్తమ్ అన్నారు.