బలహీనులే భౌతికదాడులకు పాల్పడుతారు
వైకాపా దాడిపై మండిపడ్డ కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 18 (జనంసాక్షి) :
బలహీనులే తమ బలహీనత బయట పడకుండా భౌతిక దాడులకు తెగబడుతారని, రాజకీయాల్లో ఇలాంటి దాడులకు చోటు లేదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడటం సరికాదన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. నిరాశ, నిస్పృహలో ఉన్నవారే ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తారని తెలిపారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన తెలంగాణ సాధనకు సీమాంధ్ర పార్టీల్లోని తెలంగాణ నాయకులు కలిసి రావాలని సూచించారు. లేకుంటే వారికి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పరకాల ఓటమి చెందిన కొండా దంపతులు రాబోయే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాన్నే ఊహించి దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. వారి తీరు ఇకనైనా మార్చుకోవాలని హితవుపలికారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.