బళ్ళారిలో 144 సెక్షన్‌


బెంగళూరు,మే15(
జ‌నం సాక్షి ):కర్నాటక శాసనసభ ఎన్నికల ఫలితాల దృష్ట్యా గాలి సోదరుల అడ్డా అయిన బళ్లారి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతాచర్యల్లో భాగంగా సెక్షన్‌ 144 విధించినట్టు జిల్లా ఎస్‌పి రంగరాజన్‌ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోంది. బళ్లారి జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో అన్నింటా బిజెపి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. జిల్లాలో 74.13 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. కాగా,  మైనింగ్‌ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి సోదరులు బళ్లారిలో ముందంజలో కొనసాగుతున్నారు. బళ్లారి సిటీలో గాలి సోమశేఖర్‌రెడ్డి, హరప్పనహళ్లిలో గాలి కరుణాకర్‌రెడ్డిలు విజయం వైపు దూసుకెళుతున్నారు. బళ్లారి (ఎస్‌టి)లో గాలి జనార్ధన్‌రెడ్డి అనుచరుడు ఫకీరప్ప ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి పోటీ చేయలేదు. తన అనుచరులైన తొమ్మిది మందికి ఆయన బిజెపి టికెట్లు ఇప్పించుకున్నారు. కర్నాటకలో బిజెపి అధికారంలోకి వస్తే,  ప్రభుత్వంలో గాలి చక్రం తిప్పే అవకాశం ఉంది.