బాదుషా హమారా షహార్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వచ్చే పదేళ్లలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలుపుతామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి లైఫ్‌ సైన్సెస్‌ సలహా సంఘం రూపొందించిన తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ – విజన్‌ 2030 నివేదికను కేటీఆర్‌ విడుదల చేశారు. పరిశ్రమలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలు, సలహాదారులు, ప్రభుత్వంతో చర్చించిన అనంతరం సలహా సంఘం ఈ నివేదికను రూపొందించింది. కమిటీ రూపొందించిన నివేదిక వ్యూహాత్మక దిశారిర్దేశం చేస్తోందన్నారు. ఆసియాలోనే ఆవిష్కరణలకు మంచి గమ్యస్థానంగా మార్చే లక్ష్యంలో భాగంగా మూడు నుంచి ఐదు మల్టీనేషనల్‌ కంపెనీల పరిశోధనా, అభివృద్ధి కేంద్రాలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో స్పష్టంగా పొందుపర్చినట్లు మంత్రి కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవవనరులు, పటిష్ట సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత నాణ్యత కలిగిన మౌలిక సదుపాయాలు, క్రియాశీలక ప్రభుత్వం తదితర అంశాలు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని లైఫ్‌ సైన్సైస్‌ సలహా సంఘం ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి అన్నారు.