బానిసత్వమెందుకు?

‘నేను సమైక్యవాదిని.. తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నా.. ఈనెల 28న కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ లేఖరాస్తానని.. నేను సంగారెడ్డిలో ఉంటే లాయర్ల సంగతి చెప్పేవాడిని’ అంటూ మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కళ్లు తాగిన కోతిలా చిందులేశాడు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తెలంగాణాకు వెళ్తా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. హిందుత్వ అతివాద భావజాలం గల జయప్రకాశ్‌రెడ్డి ఉరఫ్‌ జగ్గారెడ్డి బీజేపీ నాయకుడిగా, నరేంద్ర అనుచరుడిగా రాజకీయాల్లో ఎదిగారు. నరేంద్ర బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌ గూటికి చేరినప్పుడు ఆయనతో పాటు జగ్గారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. 2004లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, వామపక్షాలు కూటమిగా పోటీ చేసినపుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన జగ్గారెడ్డి కొద్ది రోజులకే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చే తాయిళాలకు ఆశపడి పార్టీతో విభేదించారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఆయన బానిసత్వ రాజకీయం రోజు రోజుకు ముదిరి పాకాన పడింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు బానిసత్వ రాజకీయాలు కొత్తేమికాదు. కానీ జగ్గారెడ్డి తరహా బరితెగించి తామెవరూ సమైక్యవాదులమని చెప్పుకోలేదు. అలాంటి సూచనలే పరోక్షంగా ఇచ్చిన నేతలకు ఎదురైనా పరాభవం, ప్రతిఘటనలు తాము చవిచూడొద్దని కొందరు ముందస్తుగానే సర్దుకుని తప్పని సరి పరిస్థితుల్లో జై తెలంగాణ అన్నారు. సమైక్యవాద పార్టీల్లో అధినేతల అడుగులకు మడుగులొత్తుతున్న ఎందరో నేతలు బాహాటంగా జై తెలంగాణ అని నినదిస్తూనే ఉన్నారు. కానీ జగ్గారెడ్డి ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాదు కాదు సీమాంధ్ర నేతలు ఇచ్చే కాంట్రాక్టులకో, డబ్బు సంచులకో, కుక్కకు బొక్కలాంటి పదవులకు ఆశపడి కన్న తల్లికే ద్రోహం చేస్తున్నాడు. రాజకీయంగా జన్మనిచ్చి లీడర్‌ను తయారు చేసిన తెలంగాణ గడ్డకు, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నమ్మక ద్రోహం చేశాడు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటున్నారా? ఆయన అసలు స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణవాదులపై, టీ జేఏసీ నేతలపై ఎప్పటికప్పుడు అవాకులు చెవాకులు పేలినందుకే కిరణ్‌ ప్రభుత్వ విప్‌ పదవి ఇచ్చాడని ఆయన అతి విశ్వాసం చూపుతుండొచ్చు. ప్రభుత్వ విప్‌ అంటే చీఫ్‌ విప్‌ గైర్హాజరీలో ప్రభుత్వ పక్షం శాసన సభ్యులకు ఓటింగ్‌కు హాజరుకావాలని విప్‌ జారీ చేసే అధికారం ఉంటుంది. పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేసేలా చూడాలి. అధికారపక్షం తరఫున ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలకు తగిన రీతిలో సమాధానం చెప్పాలి. అవసరమైతే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చాటిచెప్పాలి. కానీ కొద్దికాలంగా ప్రభుత్వ విప్‌లు ప్రతిపక్షాలు చేసే నిర్మాణాత్మ సూచనలు, విమర్శలు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఎదురుదాడికే పరిమితమవుతున్నారు. అంటే వారికి ఎదురుదాడి తప్ప ఇంకేమి తెలియవు. జగ్గారెడ్డి ఇదే విద్యను తెలంగాణవాదులపై కూడా ప్రదర్శిస్తున్నారు. తాను వ్యవహరిస్తున్న తీరును ఏమాత్రం సమీక్షించుకోకుండా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఆరోపణలు గుప్పిన్నాడు. ఇప్పుడు ఒక అడుగు ముందుకెళ్లి తాను సమైక్యవాదినని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అధిష్టానానికి లేఖ రాస్తానని చెప్పాడు. సైకోను తలపించేలా ఆయన రెచ్చిపోయి మాట్లాడుతుంటే సమైక్యాంధ్ర ముసుగులో బూటకపు ఉద్యమాలు నడిపే పెట్టుబడిదారులు సంబరపడ్డారు. ఇక్కడి ప్రజల ఆధరణ, అభిమానం, ఓట్లతో ప్రజాప్రతినిధి అయి వారి కోసం పాటు పడాల్సిన వ్యక్తి బాధ్యతను మరిచి పెట్టుబడిదారుల పక్షాన నిలవడం దేనికి నిదర్శనం. విదేశీ పాలకులు మనలను బానిసలుగా మలచుకొని రాజ్యం ఏలినట్లుగా చరిత్ర చెబుతోంది. కానీ స్వాతంత్ర భారతంలో ఒక ప్రజాప్రతినిధి కేవలం పదవి కోసం సీమాంధ్ర నేతలకు బానిసలా మారడాన్ని ఎలా అర్థం అర్థం చేసుకోవాలి. వారికి ఎలాంటి గుణపాఠం చెప్పాలి. ఒక్క జగ్గారెడ్డే కదా అని విస్మరిస్తే ఇలాంటి విషపు మొక్కలు మరెన్నో మొలకెత్తుతాయి. మొగ్గ దశలోనే తుంచేస్తేనే మరొక్కరు ఇలాంటి ప్రేలాపనలకు సిద్ధపడరు. ఇప్పటికైనా జగ్గారెడ్డి తాను ఎవరి పక్షమో సమీక్షించుకోవాలి. ఓట్లేసి పదవిలో కూర్చోబెట్టిన ప్రజలకు మద్దతుగా నిలుస్తాడా? ఇంకా పిచ్చి వీడకుండా పెట్టుబడిదారుల అడుగులకే మడుగులొత్తుతాడా అనేది ఆయనే తేల్చుకోవాలి.