బాబా దాతి మహారాజ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?

పోలీసుల తీరుపై ఢిల్లీ హైకోర్టు అసహనం

న్యూఢిల్లీ,జూలై6(జ‌నం సాక్షి): ఢిల్లీ, రాజస్తాన్‌ ఆశ్రమాల్లో 25 ఏళ్ల మహిళపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత బాబా దాతి మహారాజ్‌ను అరెస్టు చేయడంలో పోలీసులు ఆలస్యం వహించినందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. నిందితునికి వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చి నెల రోజులైనా, ఇప్పటికి ఎందుకు నిందితుడని అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణ 11న చేపట్టనుంది.గత నెలలో దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్‌ బరి పోలీస్‌ స్టేషన్‌లో ఓ మహిళ తనను దశాబ్దకాలం పాటు దతి మహారాజ్‌ వద్ద శిష్యురాలిగా చేశానని, ఈ సమయంలో తనపై అతడు, మరో ఇద్దరు శిష్యులు తనపై అత్యాచారం జరిపారని ఫిర్యాదు చేసింది. తనను తన స్వస్థలమైన రాజస్తాన్‌ పంపాలని పేర్కొనగా, తనను బలవంతంగా గదిలో బంధించారని చెప్పిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆశ్రమం నుండి తప్పించుకున్న ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసును ఢిల్లీ పోలీసుల నుండి సిబిఐకు బదిలీ చేయాలని ఢిల్లీ సిటిజన్‌ ఫోరమ్‌ ఫర్‌ సివిల్‌ రైట్స్‌ అనే ఎన్‌జివో సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది.