బాబు బ్రీఫ్‌డ్‌మీ
– మళ్లీ తెరపైకి ఓటుకునోటు కేసు
హైదరాబాద్,ఆగస్టు 29(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరవిూదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పునర్విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు ముందుకు సాగడంలేదు. అప్పట్లో స్టీఫెన్‌సన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులు అతికించినవా, వాస్తవమైనవా అనే విషయమై నివేదికను ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ ఇచ్చింది. అవి అసలైనవే తప్ప అతికించినవి కావని అప్పట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దాంతోపాటు ఈ స్వరం చంద్రబాబు నాయుడిదేనని కూడా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు కోట్లు కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన ఒక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ ల్యాబ్ అందించిన నివేదికలో కూడా ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చారు. వాటి ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. ఆయన వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.
సిఎం చంద్రబాబు రాజీనామా చేయాలి:ఆర్కె
అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకొని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. ఆడియో టేపుల్లో చంద్రబాబు, వీడియో సాక్ష్యాలతో ఆయన మనుషులు కూడా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారని ఆయన చెప్పారు. ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన తర్వాత దీనిపై పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. కోర్టు బయట విూడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులోని సంభాషణలతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు సందర్భాల్లో మాట్లాడిన ఆడియో టేపులను తీసుకుని వాటికి దేశ విదేశాల్లోని ప్రఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించానని ఆయన చెప్పారు. ఆయా ల్యాబ్‌లు ఇచ్చిన సర్టిఫికెట్లు తీసుకుని ఈనెల 8వ తేదీన ఏసీబీ కోర్టును ఆశ్రయించానన్నారు. దీనిపై రెండుమూడు సార్లు వాదనలు విన్న న్యాయమూర్తి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఈ కేసులో ముద్దాయిగా చేర్చారా లేదా అని తాము అడిగామన్నారు. అప్పట్లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలలో అవసరం లేకపోయినా కూడా తన అక్రమ సంపాదనతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆర్కే అన్నారు. కేసు నుంచి బయట పడేందుకు తర్వాత కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి పదేళ్ల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉన్నా, ఈయన మాత్రం హడావుడిగా లేని రాజధానికి పారిపోయారని, ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. ఇన్ని తప్పులు చేస్తున్నా పెద్ద మనిషిగా, ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చట్టం విూద, న్యాయవ్యవస్థ విూద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోవాలి తప్ప అప్పీలుకు వెళ్లకూడదని చెప్పారు. ఆయన ఎక్కడకు వెళ్లినా కూడా ఈ కేసులో న్యాయం జరుగుతుందనే తాము ఆశిస్తున్నామన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిస్సిగ్గుగా దొరికిపోయిన చంద్రబాబును ఇన్నాళ్ల వరకు ముద్దాయిగా చేర్చలేదన్న విషయాన్ని తాము ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చామని ఈ కేసులో పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఇన్నాళ్లుగా సరైన విచారణ జరగలేదని ఆయన అన్నారు.ఇప్పుడు చంద్రబాబు ముద్దాయి అనడానికి వీలున్న ప్రతి అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చామని తెలిపారు.