బార్‌ కోడ్‌ ఆధారంగా పశువులకు చికిత్స

మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి):  త్వరలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా పశువుల గణన వాటికి బార్‌కోడ్‌ కార్యక్రమం మొదలు కానుందని పాలమూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.దుర్గయ్య పేర్కొన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా జరిగే పశుగణన పక్రియలో ఇది కూడా చోటు చేసుకోనుందని తెలిపారు. అందరు రైతులు ఈ బార్‌ కోడ్‌ను నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. పాడి సంపదకు మరింత సేవలందించేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని చేపట్టింది.  ఇప్పటికే జిల్లాలో ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టారు. ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటీ ఆండ్‌ హెల్త్‌ (ఇనాఫ్‌) పథకం కింద ఈ పక్రియను చేపట్టనున్నారు. ప్రధానంగా పశుసంపద పరిరక్షణకు, పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఈ విధానం దోహదం చేస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇనాఫ్‌ నమోదు పక్రియ ఉమ్మడి జిల్లాలోని పశుగాణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగనుంది. పశుగణన పక్రియ మొదలుకాగనే వైద్యులు రైతులకు 12 ఆంకెల కోడ్‌ను ఇస్తారు. ఈ నంబర్‌తో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక సాప్ట్‌వేర్‌లో యజమాని వివరాలు, పుట్టిన తేదీ, ఊరు తదితర 18 అంశాలను పొందుపరుస్తారు. అలాగే యజమానికి సంబంధించి 21 అంశాలను పొందుపరుస్తారు. పశువుల జాతి ఆరోగ్య పరిస్థితి, ఆహారం తదితర వివరాలు అందులో ఉంటాయి. ఇందులోనే ఎప్పుడు టీకాలు ఇవ్వాలి, ఎలాంటి మందులు ఎప్పుడెప్పుడు వాడాలి అనే వివరాలను కూడా పొందుపరుస్తారు. రైతు ఫోన్‌ నంబర్‌ కూడా ఉండడంతో పూర్తి సమాచారం రైతుకు అందించే వీలు 
కలుగుతుంది. దీంతో  పశువుకు ఎలాంటి చికిత్సను ఇవ్వాలో కూడా సూచించే వీలు కల్పించనున్నారు. పశువుల్ని ఎవరికి అమ్మినా.. వారి పేర ఈ సమాచారాన్ని బదలాయించే వీలుకూడా ఇందులో ఉంది. ఈ పశువు ఎవరి వద్ద ఉందో సునాయాసంగా తెలుసుకోవచ్చు. ఈ విధానంపై ఇప్పటికే జిల్లాలో పశువైద్యులకు ఒకసారి అవగాహన కల్పించారు.