బిజెపిని ఓడిస్తేనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుంది
హుజూర్ నగర్ సెప్టెంబర్ 26 (జనం సాక్షి): 2024 లో బిజెపిని ఓడిస్తేనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు త్రిలోధకాలు ఇస్తుందని విమర్శించారు. బిజెపితేర రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం గాలికి వదిలేసి సప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణకు రావలసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించకపోవడం దీనిలో భాగమన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే వ్యవసాయ చట్టాలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్నారు. రాష్ట్రాలకు రావలసిన నిధులను ఇవ్వకుండా సెస్, సర్ చార్జీల పేరిట అధిక మొత్తంలో పన్నులను కేంద్రం వసూలు చేసిందన్నారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రయత్నిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడి, ఇన్కమ్ టాక్స్, సిబిఐ లాంటి సంస్థలను ఇతర రాజకీయ పార్టీలను ఇబ్బందుల పాలు చేసేందుకు ఉపయోగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమన్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ క్రియాశీలక పాత్ర వహించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.