బిజెపి ఎంపి హేమమాలినికి తప్పిన ప్రమాదం

దారిలో అడ్డంగా పడ్డ విరిగిన చెట్టు

మధుర,మే14(జ‌నంసాక్షి): ప్రముఖ నటి, బిజెపి ఎంపీ హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ఆదివారం తన నియోజకవర్గమైన మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ఓ సమావేశానికి వెళ్లున్నారు. కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా ఈదురుగాలులు, ఉరుముల కారణంగా ఓ చెట్టు విరిగి ఆమె కారు ముందు పడింది. ఒక్క క్షణం ముందు వచ్చినా ఆ చెట్టు ఆమె కారుపై పడి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తం అయిన సిబ్బంది ఆమెను మరో మార్గంలో వెనక్కి పంపారు. వాతావరణం బాగా లేకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. పశ్చిమ్‌బంగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 46 మంది మృత్యువాతపడ్డారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాబోయే 24 గంటల్లో

హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణ, చండీగఢ్‌, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురవొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.