బిజెపి ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్ షా
పాలమూరు వేదికగా భారీ బహిరంగ సభ
కెసిఆర్ ముందస్తును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు
ఎఐఎంకు భయపడే తెలంగాణ విమోచనను నిర్వహించడం లేదు
మహబూబ్‌నగర్,సెప్టెంబర్15(జనంసాక్షి): తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతూ తెలంగాణాలో అధికరాం కట్టబెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడిగా ఎన్నికలు జరిగితే గెలువలేమన్న భయంతోనే సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దం అయ్యారని అన్నారు. అయినా బిజెపికి వచ్చిన నష్టం ఏవిూ లేదని, ఈ ఎన్నికల్లో బిజెపి గెలిచి తీరుతుందన్నారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో తెరాసపై పోరాటం ప్రారంభమైంది. 2019లో ఎన్నికలు రావాల్సి ఉంది. శాసనసభ, లోక్‌సభకు ఒకే సారి ఎన్నికలు జరగాలని మోదీ ప్రతిపాదించారు. జమిలి ఎన్నికలకు కేసీఆర్ కూడా ఆమోదించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారు? తొమ్మిది నెలల్లో ఓడిపోతామని కేసీఆర్‌కు భయమా? ఎంఐఎంకు భయపడి సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదు. ఒవైసీకి భయపడే కేసీఆర్.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎలా కాపడగలుగుతారు? భాజపా అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17ను దేశమంతా జరుపుతాం. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పగటికలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. రాహుల్ ఎక్కడికిపోతే అక్కడ గెలుస్తామంటున్నారని, తెలంగాణలోనూ ఆయన అదే మాట అన్నారని గుర్తుచేశారు. దేశమంతా కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతోందని అమిత్‌షా జోస్యం చెప్పారు. ఎంఐఎంతో సంబంధం లేదని టీఆర్‌ఎస్ నేతలు చెబుతారు. పొద్దుపోతే ఎంఐఎంతో కలిసి డ్యూయెట్లు పాడుతారు. లోక్‌సభతోపాటు ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామని కేసీఆర్‌కు భయం. మే నెలలో గెలవలేని కేసీఆర్ డిసెంబర్‌లో ఎలా గెలుస్తారు? ముందస్తుకు ఎందుకు వెళ్లారో కేసీఆర్ చెప్పాలి. ఒకే దేశం, ఒకే ఎన్నికలతో ఖర్చు తగ్గుతుందని అమిత్‌షా చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ దళితులకు ద్రోహం చేశారని, కనీసం ఇప్పటికైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అంటూ నిలదీశారు. తెలంగాణలో దళితులపై అఘాయిత్యాలు పెరిగాయని, దళితులంతా రగిలిపోతున్నారని అమిత్‌షా అన్నారు. 12 శాతం రిజర్వేషన్లతో ఇతరుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. రాహుల్‌కు అనేక కలలు వస్తాయి. రాత్రి పగలు తేడా లేకుండా ఆయన కలలు కంటారు. 2014 నుంచి 2018 వరకు ఏం జరిగిందో రాహుల్ తెలుసుకోవాలి. పీవీ నరసింహారావు, టి.అంజయ్యకు కాంగ్రెస్ చేసిన అవమానం తెలుగు ప్రజలు మరిచిపోలేదు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ భాజపా విజయం సాధించింది. తెలంగాణలో కూడా భాజపా సర్కారు వస్తుంది’ అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
సింహం సింగిల్‌గా వస్తుంది: లక్ష్మణ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. భాజపాను నేరుగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు అనైతిక పొత్తులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. తెరాసను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో భాజపా సింగిల్‌గా.. సింహంలా ఎన్నికలకు వెళ్తుందన్నారు. ఎస్సీలు, గిరిజనులను దగా చేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. మజ్లిస్‌ను కాంగ్రెస్, తెదేపా, తెరాసలు పాముకు పాలు పోసి పెంచినట్లు పెంచాయని
విమర్శించారు. మజ్లిస్‌పై సామాన్య కార్యకర్తను బరిలో నిలిపి హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. అధికారంలోకి వస్తే వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హావిూ ఇచ్చారు. భాజపాకు అవకాశమిచ్చి.. కాంగ్రెస్, తెరాసలకు బుద్ధి చెప్పాలని కోరారు. వలస బాట పడుతున్న పాలమూరు బిడ్డలను కాపాడుతామని, ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని లక్ష్మణ్ వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు. మిగులు బ్జడెట్‌లో ఉన్న ప్రభుత్వాన్ని అప్పులపాలుజేశారని, ఎంఐఎం పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పాముకు పాలు పోసినట్లు ఎంఐఎంను టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పెంచిపోషించాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని ఆయన చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణలో పాలన నలుగురి చేతుల్లోనే ఉందని లక్ష్మణ్ విమర్శించారు. భాజపా నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభకు భాజపా శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.