బిజెపి, టిఆర్‌ఎస్ మధ్య ముదురుతున్న వార్
పరస్పర చేరికలతో రెచ్చగొట్టుకుంటున్ననేతలు
బిజెపి బలపడకుండా వ్యూహాలు పన్నుతున్న కెసిఆర్
ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు కదులుతున్నగులాబీదళం
హైదరాబాద్,జూలై26(జనంసాక్షి): బిజెపి, టిఆర్‌ఎస్ మధ్య వార్ ముదురుతోంది. పరస్పర విమర్శలకు పదును పెడుతున్నారు. దీనికితోడు చేరికలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో మొదలు, కార్పోరేటర్ల వరకు టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా బిజెపిని దెబ్బకొట్టే యత్నాల్లో టిఆర్‌ఎస్ ఉంది. అంతకుమించి అన్నట్లుగా బిజెపి కూడా అవే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు బూచిని చూపించి సునాయాసంగా విజయాన్ని అందుకున్న కేసీఆర్, ఈ పర్యాయం ప్రధాని మోదీ బూచిని చూపించాలని కార్యాచరణ చేశారు. అందుకు అనుగుణంగా మోడీని తిట్టిపోసే పనిలో ఇప్పుడు టిఆర్‌ఎస్ బిజీగా ఉంది. సమస్యలను పరిస్కరించే బదులు తిట్టిపోత కార్యక్రమాలకే టిఆర్‌ఎస్ పెద్దపీట వేస్తోంది. దీంతో కేసీఆర్‌కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య నడుస్తున్న వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి, ఆయనను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దీటుగానే ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ప్రధానంగా ఆయన ప్రశాంత్ కిశోర్ సలహాల ఆధారంగానే కార్యక్రమాలు నడిపిస్తున్నట్లుగా ఉంది. రాజకీయాలలో కేసీఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిన నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం కూడా కేసీఆర్‌కు గట్టిగానే గుణపాఠం చెప్పేలా స్కెచ్ వేస్తున్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ సహనం కోల్పోయి ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దూషించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో అన్న పనిలో బిజెపి నేతలు బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఇటీవలే కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నారు. చేరికలు పెరిగే కొద్దీ కేసీఆర్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదంతం ఇందులో భాగమే. రాష్ట్రంలో
బీజేపీ బలం పెరుగుతున్నప్పటికీ అధికారంలోకి రావడానికి ఆ బలం సరిపోదని వివిధ సర్వేలలో వెల్లడవుతోంది. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్న విషయం విదితమే. ఈ కారణంగానే రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని బలం చాటాలన్నది కమల నాథుల లక్ష్యం. నిజంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిస్తే మాత్రం నష్టపోయేది టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరిగితే మూడు ప్రధాన పార్టీలకూ అది జీవన్మరణ సమస్య అవుతుంది. మునుగోడులో కాషాయ జెండా ఎగిరితే మాత్రం కమలదళం బలం పెరిగిపోతుంది. పార్టీలో చేరికలు ఊపందుకుంటాయి. ఈ పరిణామం సహజంగానే కేసీఆర్‌కు రుచించదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే సొంతంగానే మెజారిటీ సమకూర్చుకోవాలి. మెజారిటీకి ఏ మాత్రం సీట్లు తగ్గినా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సహకరించవు. ఆ పరిస్థితి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలూ చేతులు కలుపుతాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ బలహీనపడితే నష్టం ఆ పార్టీకి మాత్రమే కాదు.. టీఆర్‌ఎస్‌కు కూడా. మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు రాష్ట్రంలో ఊపు విూదున్నందున బీజేపీ బలపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం లో ఉండటంతో పాటు ధనబలం పుష్కలంగా ఉన్నందున టీఆర్‌ఎస్ కూడా దూకుడువిూదుంది.ఇకపోతే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక తెలంగాణలో ఆ పార్టీకి ఊపు వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కూడా మొదలైంది. రాజగోపాల్ రెడ్డి వంటి మరికొంత మంది పార్టీని వదిలి వెళితే కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి దిగజారిపోతుందన్న ఆందోళనను ఆ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న భరోసాను కల్పించేందుకు రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారు. మొత్తంవిూద సొంతంగా మెజారిటీ సమకూర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండగా బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా దెబ్బకొట్టేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని ఎలా కాపాడుకుంటుందో చూడాలి. ప్రశాంత్ కిశోర్ అంచనాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది. అంతేకాదు, ఆ పార్టీ ఇటీవల నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఊపు విూద ఉందనుకున్నప్పుడల్లా పొంగు చల్లార్చడానికి అసంతృప్తవాదులు ఆ పార్టీలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ బెడదను ఎదుర్కొంటూ టీఆర్‌ఎస్, బీజేపీలను దాటి ముందుకు వెళ్లడానికి రేవంత్ రెడ్డి నానా యత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పెరిగినా ఫర్వాలేదు, బీజేపీ మాత్రం మరింత బలపడకూడదన్న అభిప్రాయంతో ఉన్న కేసీఆర్ అందుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే గ్యాస్,పెట్రో, జిఎస్టీలపై ఇటీవలి కాలంలో పార్టీపరంగగా ఆందోళనలను నిర్వహించారు. అయితే ఇవి ఎంతమేరకు ప్రతిఫలిస్తాయో చూడాలి.