బిజెపి మెడకు చుట్టుకుంటున్న మాల్యా వ్యవహారం

తప్పించుకునే ప్రయత్నాల్లో బిజెపి

విమర్శలకు పదును పెడుతున్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): విజయ్‌ మాల్యా వ్యవహారం ఇప్పుడు బిజెపి మెడకు చుట్టుకుంటోంది. దీని నుంచి తప్పించుకోలేని విధంగా తాజా పరిణామాలు ఉన్నాయి. విపక్ష కాంగ్రెస్‌కు అస్త్రంగా మారనున్నాయి. దాటవేత ధోరణి ఇక పనికిరాదన్నవ ఇషయం బిజెపి అగ్రనేతలు గుర్తించాలి. ఎన్నికలకు ముందు రాఫెల్‌తో పాటు, మాల్యా వ్యవహారం అదనపు ఆయుదాలు కానున్నాయి. దీనిపై ఇప్పటికే జైట్లీని రాజీనామా కోరిన కాంగ్రెస్‌ ఇప్పుడ మరింత గట్టిగా పోరాడనుంది. రెండేళ్ళక్రితం దేశం నుంచి పారిపోయే ముందురోజున తాను అరుణ్‌జైట్లీని కలిసి అన్ని విషయాలూ చర్చించానంటూ లిక్కర్‌కింగ్‌ విజయ్‌మాల్యా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటున్నది. మాల్యా మాటలను మొదట కొట్టిపారేసిన జైట్లీ ఏవో వివరణలు ఇచ్చుకున్నప్పటికీ విమర్శలను కప్పిపుచ్చలేరు. సార్వత్రక ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఈ అంశాన్ని బాగా ఉపయోగించుకుని లబ్దిపొందేలా ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ ఉంది. కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ నాయకులు కొట్టిపారేస్తున్నా మాల్యాతో ముడిపడి వెలుగుచూస్తున్న మరిన్ని అంశాలు అధికారపక్షాన్ని ఇరకాటంలో పడవేయక తప్పదు. సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్‌ దవే ఆరోపణ వాటిలో ఒకటి. 2016 ఫిబ్రవరి 28న మాల్యా చెల్లించాల్సిన బ్యాంకు బకాయిలకు సంబంధించి పద్నాలుగు బ్యాంకుల కన్సార్షియంకు నాయకత్వం వహిస్తున్న స్టేట్‌బ్యాంకు ఉన్నతాధికారులతో తన ఇంట్లో భేటీ జరిగినట్లు దవే చెబుతున్నారు. మర్నాడే సుప్రీంకోర్టులో మాల్యా దేశం విడిచి పారిపోకుండా నిలువరించే నిమిత్తం ముందస్తు జాగ్రత్తగా ఫిర్యాదు చేసి, కోర్టు నుంచి తక్షణ ఆదేశాలు పొందుదామని తాను ప్రతిపాదించినట్టు దవే చెబుతున్నారు. ఈ భేటీలో సరేనన్న స్టేట్‌బ్యాంకు ఉన్నతాధికారులు మర్నాడు సుప్రీంకోర్టుకు రాలేదనీ, ఆ కొద్ది సమయంలోనే ఏదో మతలబు జరిగిందని ఆయన అనుమానం. మాల్యాపై

సీబీఐ జారీ చేసిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ విషయంలోనూ ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంనుంచి వెళ్ళిపోతున్న విషయాన్ని కూడా తాను జైట్లీకి చెప్పానని మాల్యా అంటున్నారు. జైట్లీతో భేటీ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టి మోదీ ప్రభుత్వం పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారన్నది బీజేపీ నాయకుల వాదన.

దేశం నుంచి పారిపోవడానికి వీల్లేకుండా మాల్యాపై అక్టోబరు 16, 2015న సీబీఐ లుకౌట్‌నోటీసు జారీ చేసింది. దీనిప్రకారం సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్తే, విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేస్తారు. అనారోగ్యం, ఇతర కారణాలతో వెళ్లాల్సి వస్తే ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇంతటి ముఖ్యమైన నోటీసును నవంబరు 24, 2015న మార్చేశారు. అందుకు సీబీఐ సంయుక్త సంచాలకుడు ఎ.కె.శర్మ అనుమతించారు. ఇది మార్చకపోయి ఉంటే పాస్‌పోర్ట్‌ సంఖ్య ఆధారంగా మాల్యాను అరెస్టు చేసి ఉండేవారు. వాస్తవానికి శర్మకు నోటీసులో మార్పులు చేసే అధికారం లేదు. రూ.60కోట్ల వరకు ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే ఆయనకు అధికారం ఉంది. అంతకుమించితే సీబీఐ డైరెక్టర్‌ అనుమతించాల్సిందే. పైగా నోటీసులో జరిగిన కీలకమార్పు గురించి తమ బాస్‌ అయిన సీబీఐ డైరెక్టర్‌కు శర్మ ఉద్దేశపూర్వకంగా తెలియనివ్వలేదు. అందుకే బ్యాంకర్లు నిలదీసేసరికి సిన్హా తెల్లమొహం వెయ్యాల్సి వచ్చింది. ఆ తరువాత గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన సంయుక్త సంచాలకుడు ఎ.కె.శర్మను ఇదే విషయమై మందలించినట్లు సమాచారం. మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే సీబీఐ ఆయన ఆదేశాలు లేకుండా ‘డిటైన్‌’ నోటీసును ‘ఇన్ఫార్మ్‌’ సర్క్యులర్‌గా మార్చివేయగలదా? అని రాహుల్‌ ప్రశ్నిస్తున్నారు. మాల్యా దేశం విడిచిపారిపోయే ముందు జరిగిన ఈ స్వల్ప మార్పు కారణంగా ఆయన అరెస్టు కాకుండా తప్పించుకున్నారన్నది ఆరోపణ. మాల్యాపై 2015లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ, ఆయన అక్టోబర్‌లో విదేశాల్లో ఉండగా ‘డిటైన్‌’ సర్క్యులర్‌ను జారీ చేయించింది. మాల్యా దేశానికి తిరిగి వస్తాడా, బ్యాంకు బాకీలు తీరుస్తాడా అన్నది అటుంచితే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బడాబాబులకు అందరూ కలసికట్టుగా ఎలా సహకరిస్తారనడానికి ఈ పరిణామాలు మంచి నిదర్శనం. దీంతో ఇప్పుడు ఇదే విషయాన్నికాంగ్రెస్‌ గట్టిగా నిలదీస్తోంది.