బినామీల పాలన ఇంకెన్నాళ్ళు?

అపహాస్యమవుతున్న మహిళా రిజర్వేషన్
పట్టించుకోని అధికారులు
జుక్కల్, అక్టోబర్ 15,(జనంసాక్షి),
జుక్కల్ నియోజకవర్గంలో బినామీల పాలన కొనసాగుతోంది. నియోజక వర్గంలోని పిట్లం, నిజాం సాగర్, పెద్ద కొడప్గల్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, మండలాల్లో  చాలా మంది మహిళా సర్పంచ్, ఎంపిటిసి, వార్డు మెంబర్లకు బదులుగా వారి భర్తలు, కుమారులు, కుటుoబ సభ్యులు, బంధువులు అధికారం చెలాయిస్తున్నారు.ఈ బినామీ ప్రతినిధులు  మండల సర్వసభ్య సమావేశాలలో కూడా పాల్గొని బాజాప్తా అధికారులను ప్రశ్న ల డుగుతున్నారు. ఇదంతా గమనిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదు. ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. రిజర్వేషన్లపై మహిళల రణ నినాదమిది . ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు. చట్ట సభల్లోను 50శాతం రిజర్వేషన్ కావాలని పోరాటం చేశారు. తీరా 50శాతం రిజర్వేషన్ కల్పిస్తే పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు.
కొంత మంది భర్తచాటు భార్యలుగానే మిగిలి పోతున్నారు. ఒక్క విషయంలోను స్వతంత్రంగా వ్యవహారించడం లేదు. కొందరు తప్పనిసరయితే తప్ప ఇంటిగడప దాటడం లేదు. సతులకు బదులు పతులు పరిపాలిస్తూ అంతామేమే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లోను  భార్యలకు బదులు వారి భర్తలే పాల్గొంటున్నారు. దీంతో ప్రోటోకాల్ అమలుకావడం లేదు. అదికారులు సైతం చోద్యం చూస్తుండటంతో అంతానోరెళ్ళ బెడుతున్నారు. నియోజక వర్గంలోని పిట్లంమండలంలో 12మంది సర్పంచ్ లు,
ఏడుగురు ఎంపిటిసిలు, 209మంది వార్డు సభ్యులు, పెద్ద కొడప్ గల్ మండలంలో 11మంది సర్పంచ్ లు, నల్గురు ఎంపిటిసిలు , 107మంది వార్డు సభ్యులు, మద్నూర్ మండలంలో 19మంది సర్పంచ్ లు, ఆరుగురు ఎంపిటిసిలు, 181మంది వార్డు సభ్యులు మహిళలు ఉన్నారు. నియోజకవర్గoలోమహిళా రిజర్వేషన్ అపహాస్యం పాలవుతుంది. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా ప్రతినిధులుగా విజయ కేతనం ఎగురవేసిన   మహిళా ప్రజా ప్రతినిధులు పరిపాలన మాత్రం చేపట్టలేక పోతున్నారు. మహిళా ప్రతినిధుల భర్థలే హావా నడిపిస్తుండటంతో వారు ప్రత్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించినా అర్థం లేకుండా పోతుంది.
ప్రారంభోత్సవాలతో పాటు ప్రభుత్వం నిర్వహించే  అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. మహిళా ప్రతినిధుల గైర్హాజరుతో వారి భర్తలే కార్యక్రమాలను నిర్వహిస్తూ అంతా హడావిడి చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో మహిళల సాధికారికత కోసం స్థానిక సంస్థల్లో ప్రభుత్వము 50శాతం రిజర్వేషన్ కల్పించింది. మహిళల్లో రాజకీయ చైతన్యం పరిపాలనా దక్షత పెంపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కానీ వీటి అమలు మాత్రం ఆటకెక్కింది. ప్రోటోకాల్ ప్రకారం మహిళా ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి ద్వారానే కార్యక్రమాల నిర్వహణ చేయాల్సి ఉండగా అధికారులు మాత్రంవారి భర్తలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. సతులకుబదులు పతులు పాల్గొంటూ వారి పెత్తనాన్ని వీరు చేయడం పై మహిళా లోకం విమర్శిస్తోంది.ప్రోటోకాల్ విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై జిల్లా అధికారులు చొరవ చూపి చర్యలు తీసుకుని మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలని పలువురు కోరుతున్నారు.
ఒకవేళ మహిళా ప్రజా ప్రతినిధులకు బదులు ఎవరైనా పాల్గొంటే వారిపై నూతన పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 37(5) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలుతీసుకునే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో పురుషులతో సమానంగా అవకాశం కల్పించినట్లు గానే ప్రస్తుత చట్టం ప్రకారం మహిళా సభ్యులందరు స్వేచ్చతో తమ బాద్యతలు నిర్వహించే వీలుంది.