బీజేపీకి పంకజ ముండే గుడ్‌ బై?

ముంబయి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడిపై ఓటమిపాలైన బీజేపీ నేత, మాజీ మంత్రి పంకజ ముండే తాజాగా తన పార్టీకి షాక్‌ ఇచ్చారు. తన రాజకీయ భవిషత్తుపై పునరాలోచనలో పడ్డానంటూ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. సోమవారం ఏకంగా బీజేపీని సోషల్‌ విూడియా ఫ్రొపైల్‌ నుంచి తొలగించారు. దీంతో ఆమె బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పంకజ తన ఫేస్‌బుక్‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. తనను కలుస్తామంటూ మద్దతుదారుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయనీ.. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వారిని కలుసుకోలేకపోయానని ఆమె తెలిపారు. భవిష్యత్తులో తాను ఏమి చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. విూరు నన్ను సమయం అడుగుతున్నారు… నేనే విూకు సమయం ఇస్తున్నా… ఎనిమిది నుంచి పది రోజులు.. ఈ 8-10 రోజులు నాలో నేను ఆలోచించుకుంటాను. మున్ముందు ఏంచేయాలి? ఎటువైపు వెళ్లాలి? ప్రజలకు మనం ఏం చేయగలం? మన సామర్థ్యం ఎంత? ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? ఈ విషయాలన్నీ నేను ఆలోచిస్తాను.. అంటూ ముండే ఫేస్‌బుక్‌లో చెప్పుకొచ్చారు. దీంతో ఈ నెల 12న తన తండ్రి, బీజేపీ దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి గోపీనాథ్‌ ముండే 60వ జయంతి సందర్భంగా ఆమె తన భవిష్యత్‌ ప్రణాళికను వెల్లడించనున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలోని పార్లీ నియోజకవర్గం ముండే కుటుంబానికి కంచుకోట లాంటిది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ ముండే సోదరుడు, ఎన్సీపీ అభ్యర్థి ధనుంజయ్‌ పండిట్‌ రావు ముండే ఆమెను 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు.