బీజేపీలో చేరిన మాజీ టెస్టు క్రికెటర్: ‘మోడీకి పెద్ద ఫ్యాన్‌ని’

q3kxkad8
బెంగుళూరు: టీమిండియా మాజీ టెస్టు బ్యాట్స్‌మెన్ ఆర్. విజయ్ భరద్వాజ్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 39 ఏళ్ల విజయ్ భరద్వాజ్ ఆదివారం బెంగుళూరులో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనంత్ కుమార్ ఆయనకు బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ్ భరద్వాజ్ వన్ఇండియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీకి తానొక పెద్ద ఫ్యాన్‌నని తెలిపారు. ఆయన ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. అందువల్లే నేను బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డానని అన్నారు. టీమిండియా తరుపున విజయ్ భరద్వాజ్ 3 టెస్టులు, 10 వన్డేలు ఆడారు. అయితే రాజకీయాల్లో తన పాత్రపై ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ప్రస్తుతానికి మెంబర్‌షిప్ మాత్రమే తీసుకున్నానని చెప్పిన భరద్వాజ్, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ముఖ్య భూమికను పోషిస్తానని అన్నారు. కర్ణాటక తరుపున రంజీల్లో విజయ్ భరద్వాజ్ రాణించడంతో, 1999లో టీమిండియా తరుపున ఆడేందుకు సెలెక్టయ్యాడు. కెన్యాతో నైరోబీలో జరిగిన వన్డే సిరిస్‌లో విజయవంతంగా రాణించినా, ఆ తర్వాత రాణించక పోవడంతో 2002లో అతని అంతర్జాతీయ క్రీడా జీవితం అర్ధాంతరంగా ముగిసింది. 2005 వరకు కర్ణాటక క్రికెట్‌కు విజయ్ భరద్వాజ్ తన సేవలనందించారు. రంజీల్లో కర్ణాటక తరుపున 95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన విజయ్ భరద్వాజ్ 5,553 పరుగులు చేశారు. అందులో 14 సెంచరీలు ఉండటం విశేషం.