బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై కేసు న‌మోదు

హైద‌రాబాద్ : దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై అబిడ్స్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది. జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోల‌ను ర‌ఘునంద‌న్ రావు బీజేపీ ఆఫీసులో విడుద‌ల చేశారు. దీంతో ఆయ‌న‌పై ఐపీసీ సెక్ష‌న్ 228ఏ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన పాతబస్తీకి చెందిన సుభాన్‌ అనే వెబ్‌ రిపోర్టర్‌కు సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇప్ప‌టికే నోటీసులు జారీ చేశారు. అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయటకు రావొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా, కారులోని వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలు ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక లైంగికదాడి ఘటనలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు మరోసారి మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తులో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యే కొడుకును కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నది. అటు.. పరారీలో ఉన్న ఉమేర్‌ఖాన్‌ ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకొని పూర్తి వివరాలను రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నారనే విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కాగా, సాక్ష్యాలను తారుమారు చేసి, నిందితులను కాపాడాలన్న కుట్రకు మాజీ మేయర్‌ సహకరించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.