బీజేపీ కనుసన్నల్లోనే దాడి

– ఎన్నికల ప్రక్రియను సర్వనాశనం చేయాలని బీజేపీ యత్నిస్తుంది
– బీజేపీ నేతల అకృత్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం
– కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ
న్యూఢిల్లీ, మే9(జ‌నం సాక్షి) : కర్ణాటకలోని రాజరాజేశ్వరినగర్‌ శాసనసభ నియోజకవర్గంలో వేలాది ఓటరు ఐడెంటిటీ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రతినిథి బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. కాంగ్రెస్‌ బృందం నేత ఆనంద్‌ శర్మ విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ అక్రమాలను వివరిస్తూ తాము ఎన్నికల కమిషన్‌కు మెమొరాండం సమర్పించామని తెలిపారు. కర్ణాటకలో స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగకుండా, ఎన్నికల పక్రియను సర్వనాశనం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపామన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలనూ, ఐటీ డిపార్ట్‌మెంట్‌ను ఉపయోగించుకుని శాసనసభ ఎన్నికలను ధ్వంసం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశామన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను కూడా సమర్పించామన్నారు. మంగళవారం రాత్రి జరిగిన సోదాలు బీజేపీ కనుసన్నల్లో జరిగాయని ఆరోపించారు. ఓటర్లను, ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బీజేపీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున సొమ్ము, వనరులను ఉపయోగించి ఈ సోదాలు నిర్వహించారన్నారు. సోదాలు జరిగిన ప్లాంట్‌ బీజేపీ నాయకురాలిదేనని ఆరోపించారు. ఆ ప్లాంట్‌లో అద్దెకు ఉంటున్నవారు కూడా బీజేపీ నేతలేనన్నారు. సోదాలు నిర్వహించినది ఎన్నికల సంఘం అధికారులు కానీ, పోలీసులు కానీ కాదని, వాళ్ళంతా బీజేపీవారేనని ఆరోపించారు.