బీజేపీ మాఎమ్మెల్యేలను ప్రలోబాలకు గురిచేస్తుంది

– 100కోట్లు, మంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ చేస్తుంది
– ఇంత బ్లాక్‌ మనీ ఎక్కడిది?
– ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఏం చేస్తున్నారు? 
– మేం తలచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలను లాగుతాం
– ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మేము
– మాకే అందుకు తగిన బలముంది
– విలేకరుల సమావేశంలో జేడీఎస్‌ నేత కుమారస్వామి
బెంగళూరు, మే16(జ‌నం సాక్షి) : బీజేపీ ఎలాగైన సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని అక్రమ మార్గాల్లో వెళ్తుందని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోబాలకు గురి చేస్తుందని కర్ణాటక జేడీఎస్‌ నేత కుమారస్వామి సంచలన విషయాలు వెల్లడించారు.
బుధవారం ఆయన ఆ పార్టీ నేత రేవణ్ణుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  ఎలాగైనా అధికారంలోకి రావడానికి చూస్తున్న బీజేపీ తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.వంద కోట్లు, మంత్రి పదవి ఇవ్వజూపిందని ఆరోపించారు. ఈ బ్లాక్‌ మనీ అంతా
ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ దగ్గర కోట్ల కొద్దీ డబ్బు ఉందని, అదంతా బ్లాక్‌మనీయా లేక వైట్‌ మనీయా అని కుమారస్వామి నిలదీశారు. నల్లధనంపై పోరు అంటూనే ప్రధాని మోదీ తన ఎమ్మెల్యేలను అదే బ్లాక్‌మనీతో కొంటున్నారని విమర్శించారు. బీజేపీ ఉత్తర భారతంలో అశ్వమేథ యాత్ర మొదలుపెట్టిందని, ప్రస్తుతం గుర్రాలు కర్ణాటకలో ఉన్నాయన్నారు. ఇక్కడితో బీజేపీ అశ్వమేధ యాత్ర ముగుస్తుందని కుమారస్వామి అన్నారు. తానే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న యడ్యూరప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ముందు విూ మెజార్టీ ఎంతో చూసుకోండి అని చెప్పారు. ఆపరేషన్‌ కమల్‌ పేరుతో ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ఆపరేషన్‌ను మరచిపోండని హితవుపలికారు. విూరు మా ఎమ్మెల్యేలను లాగితే మేమూ అదే చేస్తామని హెచ్చరించారు. విూకంటే రెట్టింపు ఎమ్మెల్యేలను విూ క్యాంప్‌ నుంచి లాగుతామని, మాతో రావడానికి ఎంతో మంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కుమారస్వామి చెప్పారు. బీజేపీ కర్ణాటక ఇన్‌చార్జ్‌ ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిశారా అని ప్రశ్నించగా.. జవదేకర్‌ ఎవరు.. ఎవరా పెద్దమనిషి అని కుమారస్వామి అనడం గమనార్హం. ఇదిలా ఉంటే నిన్నటి వరకు జేడీఎస్‌లో చీలక తెచ్చామని, తమ వెంట రేవణ్ణ వర్గం నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని బీజేపీలోని పలువురు నేతలు ప్రచారం చేశారు. కాగా బుధవారం జరిగిన ప్రెస్‌ విూట్‌లో  కుమారస్వామి, రేవణ్ణలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు బీజేపీ వ్యాఖ్యలను ఖండించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామని, ప్రభుత్వాన్ని జేడీఏస్‌ నే ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బుధవారం జేడీఎస్‌ సమావేశం జరిగింఇ. ఈసమావేశంలో శాసనసభాపక్ష నేతగా కుమారస్వామిని జేడీఎస్‌ ఎన్నుకుంది.