బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బీసీ సంక్షేమ సమితి పార్లమెంట్ ఇంచార్జి అంజయ్య
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 01 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగి ఉన్న బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సమితి భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జి అంబటి అంజయ్య గౌడ్ అన్నారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. 10 శాతం జనాభా ఉన్న గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ జనాభా అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలకు 29 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రములో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ లను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.