బీసీ మంత్రులు తక్షణం రాజీనామాలు చేయాలి

తలసాని డిమాండ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):రాష్ట్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయంతో బీసీ విద్యార్థులు చదవుకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. బీసీ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడ్డారు. దీనిపై బీసీ మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని తలసాని ప్రశ్నించారు. బీసీ మంత్రులకు చీము, నెత్తూరు ఉంటే తక్షణం తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లనే రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య పెరిగిందని ఆరోపించారు. మన రాష్ట్రంలోని గ్యాస్‌ నిక్షేపాలను ఇతర రాష్ట్రాలు దోచుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఆడే డ్రామాలో భాగంగానే మంత్రులు ప్రధాని కాళ్లుపట్టుకునే విధంగా వ్యవహరించారని తలసాని అన్నారు. గ్యాస్‌ కొరత ఏర్పడుతుందని ముందే తెలిసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముఖ్యంగా పీజు రీయింబర్స్‌మెంట్‌పై బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వీరిందరిని ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాడుతామని తలసాని హెచ్చరించారు.