బుద్దారం చెరువులో చేపలు వదిలిన మంత్రి
సంక్షేమంలో ముందున్నామన్న తలసాని
వనపర్తి,ఆగస్ట్3(జనం సాక్షి): గత నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మూడవ విడత చేపపిల్లల పంపిణీలో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం పెద్దచెరువులో శుక్రవారం చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా గోపాల్‌పేట మండల కేంద్రంలో మత్స్యకారుల కోసం రూ. 10 లక్షలతో నిర్మించిన చేపల విక్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకుక్రితం వనపర్తి పర్యటనకు వెళ్తుండగా మంత్రి మార్గమధ్యంలో జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు 24 విద్యుత్ సరఫరా. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు పునర్జీవం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీళ్లు వంటి కార్యక్రమాలు గతంలో చూశామా అని అన్నారు. సామాజికంగా వెనుకబడిన గంగపుత్రులు, మత్స్యకారులు, గొళ్లకురుమలకు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం అని అన్నారు. అర్హులైన పేదలకు పెన్షన్లు పెంచి ఇస్తున్న సిఎం కెసిఆర్ మాత్రమే అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లా సస్యశ్యామలం కాబోతుందన్నారు. కాంగ్రెస్ నేతలు కూర్చీల కోసం కొట్లాడుకోవడం తప్ప అభివృద్ధి పనులు మాత్రం చెయ్యరు.. చెయ్యనియ్యరని పేర్కొన్నారు.