బెంగళూరు నుంచి విశాఖపట్టణానికి ప్రత్యేక రైళ్లు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం నుండి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం నగరానికి ప్రత్యేక రైలు సేవలు ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు బెంగళూరు నుండి విశాఖ పట్టణానికి రైళ్లు సంచరించనున్నాయి. అదే విధంగా విశాఖపట్టణం నుండి బెంగళూరుకు రెండు రైళ్లు సంచరిస్తాయని అధికారులు తెలిపారు. బెంగళూరు నగరంలోని కేఆర్ పురం రైల్వేషన్ నుండి తత్కాల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సంచరిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. గురువారం, ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు కేఆర్ పురం నుండి విశాఖపట్టణానికి రైలు బయలుదేరుతుంది.
శుక్రవారం, సోమవారం ఉదయం 11.30 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. అదే విధంగా బుధవారం, శనివారం రోజులలో విశాఖపట్టణం నుండి బెంగళూరుకు ప్రత్యేక రైలు సర్వీసులు ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు. విశాఖపట్టణం నుండి బయలుదేరే రైలు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట మీదుగా బెంగళూరు నగరంలోని కేఆర్ పురం చేరుకుంటుంది. అదే విధంగా కేఆర్ పురం నుండి గోరఖ్ పూర్ కు ప్రత్యేక రైలు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణికుల రద్ది కారణంగా ప్రత్యేక రైళ్లు ఎర్పాటు చేశామని అధికారులు తెలిపారు.